ఒకే ఉపాధ్యాయురాలుకు కోటి రూపాయల వేతనం కేసులో సూత్రధారి అరెస్టు

  • Published By: bheemraj ,Published On : June 16, 2020 / 08:04 PM IST
ఒకే ఉపాధ్యాయురాలుకు కోటి రూపాయల వేతనం కేసులో సూత్రధారి అరెస్టు

సంచలనాత్మక కేసులో సూత్రధారి ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ స్కామ్ కు సంబంధించి పుష్పేంద్ర అనే వ్యక్తినే కాకుండా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆనంద్, రామ్ నాథ్ అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపుతోకి తీసుకున్నారు. 

వారి నుంచి ఓ పిస్తోలు, గుళ్లు, మొబైల్ ఫోన్లు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 
వ్యక్తిగత కారణాల వల్ల విధుల్లో చేరని అనామికా శుక్లా అనే మహిళ పేరును, ధృవపత్రాలను ఉపయోగించుకుని పలువురు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా చలామణి అయినట్లు పోలీసులు వెల్లడించారు. 

రాష్ట్రంలోని పలు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో అనామికా శుక్లా అనే ఓ ఉపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తూ వేతనంగా రూ.కోటి అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి, సంఘటనపై విచారణ చేపట్టారు. గోండా గ్రామానికి చెందిన నిజమైన అనామికా శుక్లా 2017లో కేజీబీవీ 
టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. 

అయితే నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ ఆరోగ్య కారణాల వల్ల ఆమె విధుల్లో చేరలేదు. దీన్ని పుష్పేంద్ర అవకాశంగా తీసుకున్నాడు. ఆనంద్ నుంచి అనామికా ధృవపత్రాల నకళ్లను సంపాదించాడు. ఒక్కో అభ్యర్థి వద్ద రూ.రెండు లక్షల చొప్పున వసూలు చేసి వారికి ఉద్యోగాలు వచ్చేలా చేశాడు. 

ఈ విధంగా లఖ్ నవూతో సహా ప్రయాగ్ రాజ్, అమేథీ, జౌన్ పూర్, మిర్జాపూర్, బస్తీ తదితర గ్రామాల్లో నకిలీ టీచర్లు అనామికా శుక్లా అనే మారుపేరుతో విధుల్లో చేరారు. జీతభత్యాల రూపంలో వీరు లక్షలాది రూపాయలు స్వాహా చేసినట్లు వెల్లడైంది. ఈ విషయం తెలిసిన అసలు అనామిక జూన్ 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. దీనికంతటికీ పుష్పేంద్ర సూత్రధారి అని విచారణలో తెలిపారు. గాలింపు చేపట్టిన పోలీసులు గోమతీ నగర్ లో ఉన్న పుష్పేంద్రను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. 

Read: ప్రేమించినందుకు శిక్ష: మహిళతో రిలేషన్ పెట్టుకున్నాడని యూరిన్ తాగించిన స్థానికులు