లక్ష కడితే రూ.3 లక్షలు మీవే.. 6వేలు డిపాజిట్ చేస్తే లక్ష లోన్.. మంచిర్యాలో ఘరానా మోసం

  • Published By: naveen ,Published On : October 9, 2020 / 05:23 PM IST
లక్ష కడితే రూ.3 లక్షలు మీవే.. 6వేలు డిపాజిట్ చేస్తే లక్ష లోన్.. మంచిర్యాలో ఘరానా మోసం

online marketing scam : మంచిర్యాలలో ఘరానా మోసం జరిగింది. ఆన్‌లైన్ మార్కెటింగ్ పేరుతో.. అమాయకులను మోసం చేశారు. లక్ష డిపాజిట్ చేస్తే.. ఏడాదిలో 3 లక్షలు ఇస్తామంటూ టోకరా వేశారు. సామాన్య జనాన్ని మోసం చేస్తున్న కేటుగాళ్లను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి స్కీమ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

పెద్ద మొత్తంలో నగదు జమ అయ్యాక.. బోర్డు తిప్పేస్తారు:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని.. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆన్ లైన్ మార్కెటింగ్ దందా జోరుగా కొనసాగుతోంది. బాధితులు రోజురోజుకు పెరగడంతో.. పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. అమాయకులను గ్రూపులుగా చేసి.. చైన్ సిస్టమ్ ఫాలో అవుతారు. మొదట వారితో కొంత నగదు కట్టించుకొని.. తర్వాత వారికి కావాల్సిన వస్తువులు ఇస్తామని నమ్మిస్తారు. తర్వాత ఇంకొందరిని జాయిన్ చేయించాలని టార్గెట్లు పెడతారు. అలా.. పెద్ద మొత్తంలో నగదు జమ అయ్యాక.. బోర్డు తిప్పేస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా.. వేర్వేరు చోట్ల వేర్వేరు కంపెనీల పేరుతో.. ఈ స్కీమ్‌ల.. స్కామ్ జోరుగా సాగుతోంది.

తక్కువ కాలంలోనే రూ.44లక్షలు వసూలు:
మంచిర్యాల జిల్లాతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలే టార్గెట్‌గా.. ఈ కేటుగాళ్లు దందా మొదలుపెట్టారు. జువైవ, మల్టీ ట్రేడ్, సక్సెస్ ట్రేడ్ కంపెనీల పేరుతో.. బెంగళూరుకు చెందిన రాజు గోస్వామితో కలిసి.. మంచిర్యాలకు చెందిన కమలాకర్ ఈ దందాను నడుపుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది. శానిటైజర్లు, బాత్రూమ్ క్లీనర్స్, ఆయుర్వేద మందులు, సబ్బులు, బట్టలు అన్నీ నాసిరకమైనవి తీసుకొచ్చి.. మంచి ప్యాకింగ్‌తో, బ్రాండ్ క్రియేట్ చేసి ప్రజలకు అంటగడుతున్నారు. అతి తక్కువ కాలంలోనే.. 44 లక్షల రూపాయలను జనం నుంచి వసూలు చేశారు.

ఈ కేటుగాళ్ల దందాపై రామగుండం కమిషనరేట్ పోలీసులు నిఘా పెట్టి.. నిర్వాహకులు కమలాకర్, రాజు గోస్వామిని అరెస్ట్ చేశారు. ఈ దందాతో సంబంధమున్న వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర్నుంచి.. కారు, 3 సెల్ ఫోన్స్, 58 వేల నగదు, బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 4 లక్షల 64 వేల డిపాజిట్లను సీజ్ చేశారు. మాయమాటలు చెప్పి అతి తక్కువకాలంలోనే ఈ ముఠా.. అమాయక ప్రజల నుంచి 44 లక్షలు వసూలు చేసింది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి అంటూ ఆశ చూపే.. స్కీమ్‌లను నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

రూ.10వేలు కడితే రూ.26వేలు మీవే:
మోసపోవడానికి మనం రెడీగా ఉంటే చాలు.. మోసం చేయడానికి క్యూలో నిలబడి మరీ వస్తారు. జనం మైండ్ సెట్ మారనంత కాలం.. ఈ కేటుగాళ్ల దందా మారదు. సామాన్య ప్రజల ఆశలను, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని.. వాటిపైనే తమ కన్నింగ్ బిజినెస్ నడిపిస్తుంటారు. మల్టీలెవెల్ మార్కెటింగ్, ఆన్ లైన్ ట్రేడింగ్ పేరు చెప్పి.. కోట్లలో దోచుకుంటున్నారు. ఇప్పుడు.. నెల్లూరు జిల్లాలో మరోసారి అలాంటి భారీ మోసమే బయటపడింది.

ఆన్‌లైన్ ట్రేడింగ్ మనీ స్కీం పేరుతో రూ.85కోట్లు వసూలు:
నెల్లూరు జిల్లాలో.. ఈ మధ్య మనీ స్కీమ్‌లు వరుసగా బయటకొస్తున్నాయ్. లోన్ల పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతుంటే.. మరికొందరు ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో జనాలకు టోకరా వేస్తున్నారు. తాజాగా మరో భారీ మనీ స్కామ్‌ను పోలీసులు బయటపెట్టారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ మనీ స్కామ్‌ పేరు చెప్పి.. 10 వేలు కడితే.. వంద రోజుల్లో దాదాపు 26 వేలు చెల్లిస్తామని నమ్మబలికారు. జనాల నుంచి 85 కోట్ల దాకా వసూలు చేశారు.

6వేలు డిపాజిట్ చేస్తే లక్ష లోన్:
కాపిటల్ ట్రీ పేరుతో మరో సంస్థ ప్రజలను నిలువునా ముంచింది. లోన్ కావాలా అని కాల్ చేసి.. 6 వేలు డిపాజిట్ చేస్తే ప్రముఖ బ్యాంక్ నుంచి మీకు లక్ష లోన్ వస్తుందని నమ్మించారు. నెలకు.. ఎంత కట్టుకోవాలనేది మీ ఇష్టం అంటూ బురిడీ కొట్టించారు. పాన్, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ డీటైల్స్ తీసుకొని.. నిజంగానే లోన్ ప్రాసెస్ చేసినట్లు బిల్డర్ ఇచ్చారు. 6 వేలు డిపాజిట్ కట్టాక.. లోన్ సంగతి పట్టించుకోరు. ఇలా.. దాదాపు 50 మంది దాకా మోసపోయారు. బాధితులు ఈ విషయాన్ని బయటకు చెప్పడంతో.. కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

హిమ్, న్యూవిజన్, అగ్రిగోల్డ్.. మనీ స్కీమ్ ల పేరుతో మోసాలు:
వీటికంటే ముందు హిమ్, న్యూవిజన్, అగ్రిగోల్డ్ లాంటి రకరకాల మనీ స్కీంలు.. ఇప్పటికే ప్రజల నెత్తిన వందల కోట్ల మేర టోపీ పెట్టాయి. వీటికి సంబంధించి.. అనేక మందిపై కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది బాధితులు.. తమ డబ్బు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ.. సామాన్య జనంలో ఇంకా ఆశ చావడం లేదు. అందుకే.. ఇలాంటి మోసపూరిత స్కీమ్‌లను గుడ్డిగా నమ్మేస్తారు. తీరా మోసపోయాక.. షాక్ అవుతున్నారు.

* ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మంచిర్యాలలో కేటుగాళ్ల దందా
* లక్ష కడితే ఏడాదిలో 3 లక్షలు ఇస్తామని మోసం
* లక్ష కట్టాక రోజుకు వెయ్యి చొప్పున చెల్లిస్తామని అగ్రిమెంట్
* తక్కువ కాలంలోనే రూ.44 లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు
* జువైవ, మల్టీ ట్రేడ్, సక్సెస్ ట్రేడ్ కంపెనీల పేరుతో దందా
* నాసిరకం వస్తువులను.. అధిక ధరలకు అమ్మిన కేటుగాళ్లు
* కేటుగాళ్ల దందా గుట్టు రట్టు చేసిన రామగుండం పోలీసులు
* ఇద్దరు స్కీమ్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు