బైక్ ఇచ్చారు అరెస్ట్ అయ్యారు… ఇతరులకు బైక్ ఇచ్చే వారికి పోలీసుల వార్నింగ్..

మీరు మీ బైక్ లేదా వాహనాన్ని ఇతరులకు ఇస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. బండి ఇచ్చే ముందు ఆలోచించుకోండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు అరెస్ట్ కావాల్సి రావొచ్చు. జైలుకి వెళ్లాల్సి రావొచ్చు. ఎందుకంటే...

బైక్ ఇచ్చారు అరెస్ట్ అయ్యారు… ఇతరులకు బైక్ ఇచ్చే వారికి పోలీసుల వార్నింగ్..

Vehicle Owners Jailed

డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, మైనర్లకు, మద్యం మత్తులో ఉన్నవారికి బైక్ లు లేదా వాహనాలు ఇవ్వడం నేరం అని శిక్షార్హం అని పోలీసులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నారు. అలాంటి వారిని జైలుకి కూడా పంపిస్తున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఇతరులకు బైక్ ఇచ్చిన పాపానికి ఇద్దరు యజమానులు కటకటాల పాలయ్యారు. మద్యం మత్తులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ముగ్గురిని కటకటాల పాలు చేసింది. ఈ కేసు నమోదుతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, లైసెన్స్‌ లేని వారికి వాహనాలు ఇస్తే జైలుపాలు ఖాయమని స్పష్టమవుతోంది.

కేశంపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బొడ్డునాంపల్లి గ్రామంలో మాచారం సాయికుమార్‌ మద్యం మత్తులో ఇటీవల బైక్ నడుపుతూ.. ఎదురుగా వచ్చిన మరో బైక్ ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో గుండోల ప్రశాంత్‌ స్పాట్ లోనే చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రమాదానికి కారణమైన మాచారం సాయికుమార్‌ను అరెస్టు చేశారు. నిందితుడు సాయికుమార్‌కు మద్యం మత్తులో ఉన్నాడని తెలిసినా యజమాని సబావత్‌ వాహనాన్ని ఇచ్చాడని విచారణలో తెలిసింది. దీంతో పోలీసులు కఠినంగా వ్యవహరించారు. సబావత్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపారు.

అదేవిధంగా మృతిచెందిన ప్రశాంత్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని విచారణలో తేలింది. లైసెన్స్ లేకున్నా వాహనం ఇచ్చినందుకు యజమాని బైండ్ల శ్రీనివాసుపై కూడా పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. ఇరు వాహనాల యజమానులను 304 పార్ట్‌ -2 కింద అరెస్టు చేశారు పోలీసులు. నేరం నిర్ధారణ అయితే నిందితులకు పదేళ్ల జైలు శిక్ష తప్పదని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ముందైనా ఇతరులకు బైక్ ఇచ్చే ముందు బాగ ఆలోచించుకోవాలని ఈ ఘటన చెబుతోంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి అస్సలు ఇవ్వకూడదు. అలాగే మద్యం తాగిన వారికి కూడా ఇవ్వకూడదు. వారికి వాహనం ఇవ్వడం అంటే.. మిమ్మల్ని మీరు రిస్క్ లో వేసుకోవడమే అవుతుంది. ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు ఎవరికీ లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.