పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం…ల్యాండ్ అయ్యే నిమిషం ముందు క్రాష్

పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం…ల్యాండ్ అయ్యే నిమిషం ముందు క్రాష్

పాకిస్థాన్ లో ఘోర విమానప్రమాదం జరిగింది. లాహోర్ నుంచి బయలుదేరిన పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం కరాచీ ఎయిర్ పోర్ట్ కి సమీపంలో ఒక కాలనీ దగ్గర క్రాష్ అయింది. ఇవాళ మధ్యాహాం ల్యాండ్ అవడానికి ఒక్క నిమిషయం ముందు విమానం క్రాష్ అయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన కమర్షియల్ విమానసర్వీసులను పాకిస్తాన్ తిరిగి పునురుద్దరించిన నాలుగు రోజుల్లోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది.

క్రాష్ అయిన విమానాన్ని ఎయిర్ బస్ A320గా గుర్తించారు. విమానంలో 99మంది ప్రయాణికులు,8మంది సిబ్బందితో కలిపి మొత్తం 107మంది ఉన్నట్లు సమాచారం. అయితే, ఎంత మంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారు అనే వివరాలు ఇంకా తెలియలేదు. పాకిస్తాన్‌లోని లాహోర్ నగరం నుంచి కరాచీలోని జిన్నా విమానాశ్రయానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కరాచీ విమానాశ్రయం పాకిస్తాన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటి.

జనావాసాలకు సమీపంలో ఈ విమానం కూలిందని, ఆ ప్రాంతంలో పొగలు చెలరేగాయనని,పలు ఇళ్లు కూడా తగలబడిపోయినట్లు తెలుస్తోంది. విమానం క్రాష్ అయిన వెంటనే కరాచీలోని అన్ని పెద్ద హాస్పిటల్స్ లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి. ఎమర్జెన్సీ సేవలు అదించేందుకు అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్మీ క్విక్ రియాక్షన్ ఫోర్స్ మరియు సింధ్ పాకిస్తాన్ రేంజర్స్ స్పాట్ కు చేరుకున్నట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ISPR)తెలిపింది. పాకిస్తానీయులు రంజాన్ ముగింపు మరియు ముస్లిం సెలవుదినం ఈద్ అల్-ఫితర్ ప్రారంభోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా.. చాలా మంది నగరాలు మరియు గ్రామాల్లోని తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.