దిశపై అసభ్యకర పోస్టులు పెట్టిన శ్రీరామ్ అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : December 3, 2019 / 11:45 AM IST
దిశపై అసభ్యకర పోస్టులు పెట్టిన శ్రీరామ్ అరెస్ట్

వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతంపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన చావల్‌ శ్రీరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చావల్‌ శ్రీరామ్‌(22)ది నిజామాబాద్‌ జిల్లాగా గుర్తించారు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు. ఫేస్‌బుక్‌లో దిశపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు శ్రీరామ్‌. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

నవీపేట్ మండలం ఫకీరాబాద్‌కు చెందిన శ్రీరామ్.. వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఫేస్‌బుక్‌లో దారుణమైన పోస్టులు పెట్టాడు. బాధితురాలి ఫోటోను షేర్ చేస్తూ అభ్యంతరకరమైన, అసభ్య పోస్టులను పెట్టాడు. నవంబర్ 30న సీసీఎస్ పోలీసులు దీన్ని గుర్తించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. మహిళలను కించపరిచేలా పోస్టులు ఉండటంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫేస్‌బుక్‌లో స్టాలిన్ శ్రీరామ్ పేరుతో ఈ కామెంట్లు పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం(డిసెంబర్ 3,2019) నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి కామెంట్లు చేసిన మరికొంత మందిని పట్టుకునే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు.

శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌ పై హత్యాచారం ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. నిస్సహాయురాలైన యువతిపై కిరాతకంగా అత్యాచారం చేసిన మృగాళ్లు.. ఆపై ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి దిశను చంపేసిన వైనం తలుచుకుంటేనే రక్తం మరిగిపోతుంది. ఈ ఘటన అమ్మాయిలు, వారి తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుట్టించింది. ఆడపిల్ల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ఇంతటి దారుణంపైనా కొంతమంది నీచమైన పోస్టులు పెడుతున్నారు. నిజామాబాద్‌ కు చెందిన శ్రీరామ్ ఆ కోవకు చెందిన వాడే. దిశ ఘటనపై నీచమైన పోస్టులు పెట్టి కటకటాల పాలయ్యాడు. సోషల్ మీడియాలో స్వేచ్చగా భావాలను ప్రకటించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ భావ ప్రకటన స్వేచ్చ పేరుతో తప్పుడు మాటలు అనకూడదు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి. కాస్త విచక్షణ వాడాలి. లేదంటే.. ఇదిలో ఇలా అడ్డంగా బుక్కవ్వాల్సిందే.