13 ఏళ్లు.. 17 హత్యలు.. నగలతో ఉన్న ఆడవాళ్లే టార్గెట్ : పోలీసులకు చిక్కిన సీరియల్ కిల్లర్

వాడు మనిషి కాదు.. నరరూప రాక్షసుడు.. రక్తం మరిగిన హంతకుడు. ఆడవాళ్లనే టార్గెట్‌ చేసి మత్తులోకి దించి మట్టుబెట్టే యమ కింకరుడు. ఒంటిపై నగలు కనిపిస్తే చాలు

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 07:58 AM IST
13 ఏళ్లు.. 17 హత్యలు.. నగలతో ఉన్న ఆడవాళ్లే టార్గెట్ : పోలీసులకు చిక్కిన సీరియల్ కిల్లర్

వాడు మనిషి కాదు.. నరరూప రాక్షసుడు.. రక్తం మరిగిన హంతకుడు. ఆడవాళ్లనే టార్గెట్‌ చేసి మత్తులోకి దించి మట్టుబెట్టే యమ కింకరుడు. ఒంటిపై నగలు కనిపిస్తే చాలు

వాడు మనిషి కాదు.. నరరూప రాక్షసుడు.. రక్తం మరిగిన హంతకుడు. ఆడవాళ్లనే టార్గెట్‌ చేసి మత్తులోకి దించి మట్టుబెట్టే యమ కింకరుడు. ఒంటిపై నగలు కనిపిస్తే చాలు శివాలెత్తుతాడు. కల్లు కంపౌండ్లు, మద్యం దుకాణాలు అడ్డాగా మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. అక్కడే పక్కా స్కెచ్‌ గీసి శివార్లకు తీసుకెళ్లి మాయ మాటలతో మట్టుబెడుతాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 మంది మహిళలను అంతమొందించిన ఉన్మాది అతడు. నగల కోసం ఒళ్లు గగుర్పొడిచే ఘాతుకాలకు పాల్పడ్డ డేంజరస్‌ కిల్లర్‌ అతడు. జనం మధ్యే తిరుగుతున్న మానవ మృగం పోలీసులకు చిక్కాడు.

డిసెంబర్ 17న జరిగిన హత్యతో బయటపడిన ఘోరాలు:
మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం గుండేడ్‌ గ్రామానికి చెందిన ఎరుకుల శ్రీను దురాఘతాలివి. వింటుంటేనే విస్తుపోయేలా చేస్తున్న దుర్మార్గాలివి. నవాబుపేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలమ్మ దేవరకద్ర మండలం డోకూరు శివారులో అతి దారుణంగా హత్యకు గురైంది. డిసెంబర్ 17న ఈ హత్య జరగగా.. విచారణలో ఎరుకుల శ్రీనుపై పోలీసులకి అనుమానం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. నిజం ఒప్పుకోవడమే కాకుండా.. మరికొన్ని భయంకరమైన విషయాలను తెలిపాడు. 2007 నుంచి ఇప్పటి వరకు పదహారు మంది మహిళలతో పాటు సొంత తమ్ముడిని హత్య చేసినట్టు తేలింది.

2007 నుంచి హత్యాకాండ:
ఎరుకల శ్రీను.. 2007 నుంచి తన హత్యాకాండను మొదలుపెట్టాడు. కల్లు, మద్యం దుకాణాల దగ్గర అడ్డా వేస్తాడు. అక్కడికి నగలు వేసుకొని వచ్చిన మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. వారిని మాయ మాటలతో అక్కడి నుంచి తీసుకెళ్లి శివారుల్లో మరోసారి మద్యం తాగించి వారు మత్తులోకి జారుకోగానే తనలోని మృగాన్ని నిద్రలేపుతాడు. అతికిరాతకంగా మహిళలను అంతమొందించి వారి ఒంటిపై నగలను ఎత్తుకెళ్తాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. 13ఏళ్లలో 17 మందిని హత్య చేశాడు.

సత్ ప్రవర్తనతో విడుదలై మళ్లీ నేరాలు:
2007లో 5 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎరుకల శ్రీనుకు.. తుమ్మాజిపేట కేసులో జీవితఖైదు పడింది. అయితే అప్పుడు మంచివాడిగా నటించి సత్ర్పవర్తన కింద బయటకు వచ్చాడు. జైలు అధికారులను నమ్మించి జైలు పెట్రోల్‌ బంకులోనే ఉద్యోగం కూడా చేశాడు. కానీ కొద్ది రోజులకే తనలోని మానవ మృగాన్ని మరోసారి నిద్రలేపాడు. 2014లో తన హత్యల పరంపరను కొనసాగించాడు. 2015లోనూ అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వంగూరు మర్డర్‌ కేసులో మూడేళ్ల జైలు జీవితం గడిపాడు. రెండు సార్లు ఖైదు జీవితం అనుభవించినా తన తీరు మార్చుకోలేదు. ఈసారి మరింత రెచ్చిపోయాడు. 2018లో ఏకంగా నలుగురు మహిళల్ని మట్టుబెట్టి నగలు ఎత్తుకెళ్లాడు.

భార్య సహకారం:
క్రూరంగా ఆలోచిస్తాడని.. అందరినీ ఒకే విధంగా హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. శ్రీనుకు భార్య సహకారం కూడా ఉందని అంటున్నారు. దోచుకెళ్లిన నగలను ఆమె అమ్మేదని గుర్తించారు. అతనిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ఏ2గా శ్రీను భార్యపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.

* జనం మధ్యే తిరుగుతున్న మానవ మృగం
* ఒంటిపై నగలు కనిపిస్తే చాలు శివాలెత్తే శ్రీను
* మద్యం దుకాణాల దగ్గర అడ్డా వేసి నగలు వేసుకొని వచ్చిన మహిళలపై స్కెచ్‌
* శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి హత్య, నగలు చోరీ
 *2007 నుంచి సాగిస్తున్న హత్యాకాండ
* 16 మంది మహిళలను హత్య చేసిన సీరియల్‌ కిల్లర్‌
* సొంత తమ్ముడిని కూడా మర్డర్ చేసిన శ్రీను

సీరియల్‌ కిల్లర్‌ పై కేసులు:
* 2007 తుమ్మాజిపేట హత్య కేసులో జీవిత ఖైదు, సత్ప్రవర్తన కింద విడుదల
* 2007 బాలానగర్‌, నాగర్‌కర్నూల్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల పరిధిలో ఒక్కో కేసు
* 2007 జైలు నుంచి పారిపోయిన కేసు
* 2014 వంగూరు మర్డర్‌ కేసులో మూడేళ్ల జైలు శిక్ష
* 2014 షాద్‌నగర్‌, బాలానగర్‌ హత్య కేసుల్లో నిందితుడు
* 2015 శంషాబాద్‌ రూరల్‌ పీఎస్‌లో 3 కేసులు
* 2015 షాద్‌నగర్‌, కేశంపేట పీఎస్‌లలో ఒక్కో కేసు
* 2018 నాలుగు హత్య కేసుల్లో నిందితుడు

Also Read : దిశ నిందితుడి ఇంట్లో తీవ్ర విషాదం : చావు బతుకుల మధ్య తండ్రి