దివ్య తేజస్విని హత్య కేసు, నాగేంద్ర అరెస్ట్ కు రంగం సిద్ధం

  • Published By: naveen ,Published On : October 26, 2020 / 11:19 AM IST
దివ్య తేజస్విని హత్య కేసు, నాగేంద్ర అరెస్ట్ కు రంగం సిద్ధం

divya tejaswini murder case: సంచలనం సృష్టించిన విజయవాడ దివ్య తేజస్విని మర్డర్‌ కేసులో.. నిందితుడు నాగేంద్ర అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగేంద్ర దాదాపుగా కోలుకున్నాడు. ఇప్పటికే వైద్యులు పలు శస్త్రచికిత్సలు చేశారు. నేడు(అక్టోబర్ 26,2020) మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి నాగేంద్రను డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉంది. డిశ్చార్జ్‌ చేసిన వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది.

దివ్యది హత్యే, నాగేంద్ర అబద్దాలు చెప్పాడు:
ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన తేజస్వినిది హత్యేనని పోస్టుమార్టం రిపోర్ట్‌, ఫోరెన్సిక్‌ నివేదికలు స్పష్టం చేశాయి. దివ్య ఒంటిపై ఉన్న కత్తిపోట్లు తనకు తానుగా చేసుకున్నవి కాదని.. నిందితుడు నాగేంద్రనే ఆమె హత్య చేసినట్టు పోలీసులు నిర్థారించారు. తామిద్దరు ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు కట్టుకథ అల్లి జనాల్ని నమ్మించే ప్రయత్నం నాగేంద్ర చేశాడని పోలీసులు గుర్తించారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు విచారణను వేగంగా పూర్తి చేస్తున్నారు. బధవారం పూర్తి వివరాలతో కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నారు. విజయవాడ సీపీ స్వీయ పర్యవేక్షణలో కేసు విచారణ సాగుతోంది.

పక్కా ప్లాన్ ప్రకారమే దివ్య మర్డర్:
దివ్య తేజస్విని హత్య కేసులో.. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. పెద్దలు తమ ప్రేమకు అంగీకరించకపోవడంతోనే ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని పోలీసులకు నాగేంద్ర ఇచ్చిన వాంగ్మూలం తప్పని తేల్చారు. పక్కా స్కెచ్‌ ప్రకారమే దివ్య తేజస్వినిని నాగేంద్ర చంపాడని, పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తోనే మర్డర్‌ చేశాడనే నిజాన్ని ఇటు ఫోరెన్సిక్‌ అటు పోస్టుమార్టం నివేదికలు బయటపెట్టాయి. నాగేంద్ర ఒంటిపై గాయాలు తనకు తాను చేసుకున్నవేనని రిపోర్ట్‌ స్పష్టం చేసింది. ముందు దివ్య తేజస్వినిపై నాగేంద్ర దాడి చేసి కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. ఆమె మరణించిందని నిర్థారించుకున్న తర్వాతే ఎవరికీ అనుమానం రాకుండా కత్తితో తన శరీరంపై స్వయంగా గాయాలు చేసుకున్నాడు.

నాగేంద్రతో పాటు మరికొందరిపై దిశ టీం కేసులు:
దివ్య తేజస్విని హత్య విషయంలో నాగేంద్రతో పాటు మరికొందరిపై దిశ టీం కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దివ్యను మర్డర్‌ చేసే విషయంలో నాగేంద్రకు సహకరించిన వ్యక్తులను కేసు పరిధిలోకి తీసుకువచ్చేలా దిశ టీం అడుగులు వేస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇన్‌స్టాగ్రాం, నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్ క్రియేట్‌ చేసిన వారిపైనా చర్యలు తీసుకోనున్నారు.