బెంగళూరుకు అండర్ వరల్డ్ డాన్ రవి పుజారి

  • Published By: venkaiahnaidu ,Published On : February 25, 2020 / 10:29 AM IST
బెంగళూరుకు అండర్ వరల్డ్ డాన్ రవి పుజారి

రెండున్నర దశాబ్దాలకుపైగా నేర సామ్రాజ్యాన్ని నడిపిన అండర్‌ వరల్డ్‌ డాన్‌ రవి పుజారిని ఎట్టకేలకు బెంగళూరుకు తీసుకొచ్చారు కర్ణాటక పోలీసులు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్ లో పుజారిని గేతేడాది జనవరి-31న స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. సెనెగల్‌ లో ఏడాదిన్నరగా జైలులో ఉన్న రవిని భారత్‌కు తీసుకొచ్చేందుకు అక్కడకు వెళ్లిన కర్ణాటక పోలీసు అధికారులు, అదనపు డీజీపీ అమర్‌కుమార్‌ పాండే, సీసీబీ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని బృందం ఆదివారం అర్ధరాత్రి దాటాక అతడిని బెంగళూరుకు తీసుకొచ్చారు.

ఎయిర్‌పోర్టు నుంచి మడివాళకు తీసుకెళ్లి రాత్రంతా విచారణ జరిపారు. సోమవారం మధ్యాహ్నం 10వ ఏసీఎంఎం కోర్టు ముందు హాజరు పర్చగా…మార్చి 7 వరకూ పోలీస్‌ కస్టడీకి జడ్జి ఆదేశించారు. రవిపై 200కుపైగా కేసులు ఉండటంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య అత్యంత రహస్యంగా విచారించేందుకు రాష్ట్ర పోలీసులు సిద్ధమయ్యారు. కర్ణాటకతోపాటు ముంబై తదితర ప్రాంతాలలో కేసులు ఉండటంతో ఇక్కడ విచారణ పూర్తయితే ముంబై పోలీసులకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

ఫుజారి స్వస్థలం కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని పడబిద్రి. వీరి కుటుంబం పుజారి యుక్తవయస్సులో ఉన్నప్పుడే ముంబైకి షిఫ్ట్ అయింది. అంధేరీలో క్రిమినల్ గా పోలీస్ రికార్డులకెక్కాడు. గ్యాంగ్ స్టర్ బాలా జల్టీని చంపిన తర్వాత తనను తాను అండర్ వరల్డ్ డాన్ గా ప్రకటించుకున్నాడు.  2009 నుంచి 2013 మధ్య కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలను డబ్బుల కోసం బెదిరించినట్లు పుజారిపై భారత్ లో కేసులు నమోదయ్యాయి.

అంతేకాకుండా కిడ్నాప్, మర్డర్, బ్లాక్ మెయిల్, చీటింగ్ వంటి వివిధ కేసులు కూడా పుజారిపై నమోదయ్యాయి. 10 ఏళ్ల క్రితమే ఈ గ్యాంగ్ స్టర్ దేశం విడిచి పారిపోయాడు. ఇంగ్లిషు, హిందీ, కన్నడ భాషల లో ప్రావీణ్యం కలిగిన రవికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవలే కుమారుడికి ఆస్ట్రేలియాలో విలాసవంతంగా వివాహం చేశారు.

సెగనల్ స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఆంటోని ఫెర్నాండేజ్ అనే పేరుతో నకిలీ పాస్ పోర్టుతో పుజారి సెనెగల్ దేశంలో ఉన్నాడు.  సెనెగల్ రాజధాని డాకర్ లో ఇంటర్ పోల్ సెంట్రల్ బ్యూరో..లోకల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్తో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పుజారిని గతేడాది జనవరిలో అరెస్ట్ చేశారు.