కారుతో కుటుంబం జలసమాధి.. కేసు మిస్టరీ వీడింది!

  • Published By: srihari ,Published On : June 22, 2020 / 04:40 PM IST
కారుతో కుటుంబం జలసమాధి.. కేసు మిస్టరీ వీడింది!

అల్గునూర్ శివారు ప్రాంతంలోని కాకతీయ కాలువలో పడిన కారులో కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వీరిది ఆత్మహత్య అని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన తర్వాత వారిది ఆత్మహత్యగా తేలిందని వెల్లడించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ సత్యనారాయణరెడ్డి, సోదరి రాధ, మేన కోడలు వినయశ్రీ కారుతో కాకతీయ కాలువలో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. 

ఈ కేసు దర్యాప్తులో హత్యా? ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్తూ జరిగిందా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారించారు. ఒక ఫర్టిలైజర్‌ షాప్‌లో పోలీసులకు కుటుంబానికి చెందిన సూసైడ్‌ నోట్‌ లభించింది. సూసైడ్‌ నోట్‌ పరిశీలించి అనంతరం పోలీసులు అది స్వయంగా సత్యనారాయణరెడ్డి రాసిందేననే నిర్ధారణకు వచ్చారు. సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఈ కేసు మిస్టరీ ఛేదించారు పోలీసులు. ఈ ఏడాదిలో జనవరి 27న కరీంనగర్‌లోని బ్యాంక్‌ కాలనీలో ఇంటి నుంచి సత్యనారాయణరెడ్డి తన భార్య రాధ, కుమార్తె వినయశ్రీలతో కలిసి కారులో బయల్దేరారు.

అదే రోజు వారి కారు అల్గునూరు దగ్గర కాకతీయ కాలువలో పడింది. కుటుంబంతో సహా వారు ఏమయ్యారు అనేది మిస్టరీగా మారింది. వారి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు పలు కోణాల్లో విచారించారు. ఈ క్రమంలో ఇరవై రోజుల తర్వాత కరీంనగర్‌ నుంచి గన్నేరువరం బయలుదేరిన ఓ బైక్‌ అదుపుతప్పి అదే కాలువలోకి పడింది. మహిళ నీటిలో కొట్టుకుపోయింది. ఆ మహిళ కోసం గాలించేందుకు కాలువలో నీటిని నిలిపివేయడంతో ఈ కారు కూడా బయటపడింది. 

ఈ క్రమంలోనే కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో సత్యనారాయణరెడ్డి కారు కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆత్యహత్య చేసుకునేందు ఇబ్బందులు కూడా వారికి లేవని వెల్లడించిన సంగతి తెలిసిందే.