సుషాంత్ సింగ్ మృతి కేసు, ఎట్టకేలకు ఈడీ ఆఫీస్‌లో విచారణ బృందం ముందు హాజరైన రియా చక్రవర్తి

  • Published By: naveen ,Published On : August 7, 2020 / 12:53 PM IST
సుషాంత్ సింగ్ మృతి కేసు, ఎట్టకేలకు ఈడీ ఆఫీస్‌లో విచారణ బృందం ముందు హాజరైన రియా చక్రవర్తి

ఎట్టకేలకు రియా చక్రవర్తి అజ్ఞాతం వీడింది. ఈడీ ఆఫీసులో ప్రత్యక్షం అయ్యింది. విచారణ బృందం ముందు హాజరైంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసును బీహార్ పోలీసులు విచారణ చేస్తున్నప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ముంబైలోని ఈడీ ఆఫీస్‌లో శుక్రవారం(ఆగస్టు 7,2020) ప్రత్యక్షమైంది. రియా చక్రవర్తి సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందని, సుశాంత్‌ను రియా మానసికంగా ఎంతో వేదనకు గురిచేసిందని సుశాంత్ తండ్రి రియా చక్రవర్తిపై బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో రియాపై మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈడీ ఈ కేసుపై దృష్టి సారించింది.



రియా అభ్యర్థన తిరస్కరణ:
విచారణకు హాజరుకావాల్సిందిగా రియాకు ఈడీ సమన్లు పంపింది. కాగా, సుప్రీంలో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ జరిగే వరకూ తన స్టేట్‌మెంట్ రికార్డ్ ప్రక్రియను వాయిదా వేయాలని రియా చక్రవర్తి చేసిన అభ్యర్థనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ‘నో’ చెప్పింది. ఆమె కోసం శుక్రవారం ఉదయం 11.30 వరకూ వేచి చూస్తామని.. అప్పటికీ ఆమె హాజరుకాని పక్షంలో మళ్లీ తాజా సమన్లు జారీ చేస్తామని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో.. చేసేదేమీ లేక డెడ్ లైన్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు రియా చక్రవర్తి ముంబైలోని ఈడీ ఆఫీసుకి వచ్చింది.

సుశాంత్ అకౌంట్ నుంచి రూ.15కోట్లు మళ్లింపు:
సుశాంత్ ఖాతా నుంచి రియా చక్రవర్తి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందనే ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. సుశాంత్ రాజ్‌పుత్ కేసులో తాజాగా మరో ఇద్దరికి కూడా ఈడీ సమన్లు పంపింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీకి సమన్లు పంపిన ఈడీ నేడు(ఆగస్టు 7,2020) విచారణకు హాజరుకావాల్సిందిగా స్పష్టం చేసింది. సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథానికి కూడా నోటీసులు పంపిన ఈడీ రేపటిలోగా(ఆగస్టు 8,2020) విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సుశాంత్ కేసులో ఇప్పటికే సీబీఐ కూడా రియాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.



యువ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసు సంచలనంగా మారింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత నిర్ధారించారు. ఆ తర్వాత ఆత్మహత్య కాదు హత్య అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సుశాంత్ మరణం చుట్టూ మిస్టరీ నెలకొంది. సుశాంత్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.