ప్రియాంకరెడ్డికి జరిగిన దారుణంపై ఎవరేమన్నారంటే

  • Published By: venkaiahnaidu ,Published On : November 30, 2019 / 11:10 AM IST
ప్రియాంకరెడ్డికి జరిగిన దారుణంపై ఎవరేమన్నారంటే

హైదరాబాద్ శివార్లలో నాలుగు మానవమృగాల చేతిలో బలైపోయిన ప్రియాంకరెడ్డి సంఘటన దేశప్రజల హృదయాలను కలిచివేసింది. దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఆ నాలుగు మానవ మృగాలను బహిరంగంగా ఉరితీయాలని, వాళ్లను ఎన్ కౌంటర్ చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంకరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆ మానవమృగాలను వెంటనే ఉరి తీయాలని అంటున్నారు. 

ప్రియాంకరెడ్డికి జరిగిన దారుణంపై ఎవరేమన్నారంటే

-రాహుల్ గాంధీ,కాంగ్రెస్ నాయకుడు

హైదరాబాద్‌లో డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణమైన అత్యాచారం & హత్య గురించి విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఓ మనిషి సాటి మనిషిపై ఇంత క్రూరంగా ఎలా దాడికి పాల్పడతాడనేది ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. ఈ సమయంలో నా ఆలోచనలు & ప్రార్థనలు బాధిత కుటుంబంతో ఉన్నాయి.

-జాతీయ మహిళా కమిషన్‌ 

ఎంతోమంది హైదరాబాద్ మహా నగరానికి ఉపాధికోసం వస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో మహిళలకు భద్రత లేకపోవటం విచారకరం. మహిళలపై అఘాయిత్యం చేసేందుకు తోడేళ్లు వీధుల్లో యదేచ్ఛగా సంచరిస్తున్నట్లుగా ఇటువంటి ఘటనలతో అనిపిస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన దుర్మార్గులపై  వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.

-కేంద్ర హోం మంత్రి(సహాయ)కిషన్ రెడ్డి

ప్రియాంకరెడ్డికి ఘటనతో యావత్ దేశం తీవ్ర ఆందోళన, బాధ వ్యక్తం చేస్తోంది. దోషుల పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. దోషులకు న్యాయసాయం చేయొద్దని న్యాయవాదులను కోరాను. దోషులకు ఉరిశిక్ష పడాలి. నేరస్తులను కఠినంగా శిక్షించపడేలా చూడాలని తెలంగాణ పోలీసులను కోరడం జరిగిందన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలను పూర్తిగా అరికట్టేలా అంతా ముందుకు రావాలి.

-కేటీఆర్,తెలంగాణ మంత్రి

ఇలాంటి ఘటనలు జరగడం విచారకరం. ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ జంతువుల్ని కఠినంగా శిక్షిస్తాం. ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం. ఈ కేసును నేనే పర్సనల్‌గా మానిటర్ చేస్తున్నా. ఎవరైనా ఆపదలో ఉంటే 100కు ఫోన్ చేయాలని కోరుతున్నా.

-పవన్ కళ్యాణ్,జనసేన అధినేత

మూగజీవాలకు వైద్యం చేసే ప్రియాంకను మానవ మృగాలు అత్యాచారం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ప్రియాంక రెడ్డిపై సామూహిక అత్యాచారం చేసి చంపేసిన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబానికి జనసేన తరపున, తన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా కఠినంగా శిక్షించాలి.

-చంద్రబాబు నాయుడు,టీడీపీ అధినేత

ప్రియాంకరెడ్డి దారుణ హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటి మానవమృగాలకు సమాజంలో ఉండే హక్కు లేదు.

-ఆశాదేవి,నిర్భయ తల్లి

ఆడపిల్లలు బయటకు వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి దేశంలో లేకుండా పోయింది. నా బిడ్డలానే ప్రియాంక కూడా కామాంధుల దాహనికి బలైపోయింది. ఈ దారుణానికి పాల్పడిన వారికి ఉరి శిక్ష వేయాలి.

-అల్లు శిరీష్,సినీ నటుడు

నేను చాలా విచారంగా, కోపంగా ఉన్నాను. నిస్సహాయంగా ఉన్నాను. మా సామూహిక కోపం ప్రియాంకకు న్యాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా మహిళలకు మరింత భద్రతా చర్యలను కూడా నిర్ధారిస్తుంది. జస్టిస్ ఫర్ ప్రియాంకరెడ్డి.

-మంచు మనోజ్,సినీ నటుడు

ప్రియాంకరెడ్డికి జరిగిన దారుణం గురించి తెలిసి తీవ్రంగా బాధపడ్డాను. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. నా సోదరీమణులందరూ అవసరమైతే @hydcitypolice మరియు #Sheteam ను సంప్రదించాలని నేను అభ్యర్థిస్తున్నాను.

-సుధీర్ బాబు,సినీ నటుడు

ప్రియాంకకు జరిగిన దారుణం గురించి ఆలోచించడానికి కూడా చాలా భయంగా ఉంది. నిందితులకు కఠిన శిక్షలు వేస్తే తప్ప మన మధ్యలో తిరుగుతున్న మానవ మృగాలకు భయం పుట్టదు. వారం రోజుల్లోనే నిందితులకు శిక్ష అమలుచేయాలి.

-అలీ,సినీ నటుడు,వైసీపీ నాయకుడు

ప్రియాంకరెడ్డికి జరిగిన దారుణంపై  తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నా. సిటీ నడిబొడ్డున ఈ ఘటన జరగడం బాధాకరం. ఏ ఫ్యామిలీకి ఇలా జరగొద్దని అనుకుంటున్నా. షూట్ చేయొద్దు..ఉరి తీయొద్దు..తన కూతురికి ఏమి జరిగిందో..నిందితులకి అదే జరగాలని ప్రియాంక తల్లి కోరుతోంది. నిందితులకు సహాయం చేయవద్దని బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాను.