ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం 

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 03:48 PM IST
ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం 

ఢిల్లీ : ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే పెద్ద శబ్ధం వచ్చి ఇంజిన్ విఫలమవ్వడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే ఈ ఘటనను కేంద్ర పౌరవిమానయాన శాఖ సీరియస్ గా తీసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఇండిగోను ఆదేశించింది. జనవరి 3న చెన్నై నుంచి కోల్ కతాకు బయలుదేరిన ఎయిర్ బస్ ఏ 320 నియో విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే చెన్నైకి తిరిగి వచ్చింది. విమానం గాల్లో ఉన్న సమయంలో పెద్ద శబ్ధంతో ఇంజిన్ ఫెయిల్ అవడంతోపాటు స్వల్పంగా మంటలు, పొగ రావడాన్ని పైలెట్లు గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని చెన్నైకి తీసుకొచ్చి ల్యాండ్ చేశారు. 

ఆ సమయంలో విమానం బాగా ఊగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఏ320 నియో విమానాల్లోని ఇంజిన్ లలో లోపాలు తలెత్తడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ఇదే విధంగా పలుమార్లు జరగడం వల్ల ఏ320 నియో విమానాన్ని కొన్నిరోజులపాటు ఉపయోగించలేదు. ఘటనపై విచారణ చేపట్టేందుకు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం రంగంలోకి దిగింది.