వరంగల్ లో 9 మంది డెత్ మిస్టరీ వీడింది : ఎలా చంపాడో తెలుసా

  • Published By: madhu ,Published On : May 25, 2020 / 12:58 AM IST
వరంగల్ లో 9 మంది డెత్ మిస్టరీ వీడింది : ఎలా చంపాడో తెలుసా

నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఎన్నో అనుమానాలు.. మరెన్నో ప్రశ్నలకు సమాధానం దొరికింది. మిస్టరీగా మారిన వరంగల్‌ గొర్రెకుంట ఘటనకు ఫుల్‌స్టాప్‌ పడింది. తొమ్మిది మంది వలస కూలీల మృతి కేసులో చిక్కుముడి వీడింది. బూస్రా ప్రియుడు సంజయ్‌కుమార్‌ యాదవే.. హత్యల కీలక సూత్రధారిగా నిర్ధారణ అయింది. తొమ్మిది మందికి నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక… ఈడ్చుకెళ్లి బావిలో పడేసినట్లు తేలింది.

విడాకులు తీసుకున్న బుస్రా : –
స్నేహితులతో కలిసి సంజయ్‌కుమార్‌ యాదవ్ సామూహిక హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు సంజయ్‌ కుమార్ యాదవ్‌‌… మక్సూద్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి. గన్నీ బ్యాగులు కుడుతూ మక్సూద్‌ వద్ద పని చేసేవాడు. అలా మక్సూద్‌ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఆ  కుటుంబసభ్యులతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. అయితే మక్సూద్‌ కూతురు బుస్రా.. భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది.

మరొకరితో సన్నిహితంగా ఉంటోందంటూ : –
బుస్రా ఒంటరిగా ఉంటుందని గ్రహించిన  సంజయ్‌కుమార్‌.. ఆమెకు దగ్గరవ్వాలనుకున్నాడు. అందులో భాగంగా ఆమెకు గిఫ్ట్‌లు కొనిచ్చేవాడు. ఆర్థికంగా ఆ కుటుంబానికి అప్పుడప్పుడు సాయపడేవాడు. ఇలా రానురాను ఆ కుటుంబంలో ఒకడిలా కలిసిపోయాడు. సీన్‌కట్‌ చేస్తే… ఇటీవల బుస్రా… యాకూబ్‌ పాషాతో సన్నిహితంగా ఉంటుందని తెలుసుకున్నాడు. దీంతో తనకు దక్కాల్సిన బుస్రా… మరొకరికి  సన్నిహితంగా ఉంటోందంటూ రగిలిపోయాడు.

డబ్బులు ఇవ్వాలంటూ బుస్రాపై వత్తిడి : –
ఆమెను దక్కించుకునేందుకు చాలా డబ్బు ఖర్చు పెట్టిన సంజయ్‌కుమార్‌ యాదవ్‌… ఆ డబ్బంతా తిరిగి రాబట్టాలనుకున్నాడు. బుస్రాపై ఒత్తిడి తెచ్చాడు. లాక్‌డౌన్‌ సమయంలో డబ్బు కోసం మరింత టార్చర్‌ చేశాడు. తన డబ్బు తనకిచ్చేస్తే బీహార్‌ వెళ్లిపోతానని చెప్పాడు. సంజయ్‌ టార్చర్‌ రోజురోజుకు పెరుగుతుండటంతో… విషయాన్ని తండ్రికి చెప్పింది. అటు తమ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న మృతుడు షకీల్‌ కుటుంబానికి కూడా చేరవేసింది.

సంజయ్ కు మందలింపులు : –
దీంతో ఇటు మక్సూద్‌, అటు షకీల్‌… సంజయ్‌కుమార్‌ను మందలించారు. అయినప్పటికీ సంజయ్‌ తీరు మార్చుకోలేదు. ఇక చనిపోయిన ఇద్దరు బీహార్‌ యువకులు శ్యామ్, రామ్‌లకు మక్సూద్‌ కుటుంబంతో పరిచయం ఉంది. దీంతో ఆ ఇద్దరికి కూడా సంజయ్‌కుమార్‌  వేధిస్తున్నాడంటూ బుస్రా చెప్పింది. వాళ్లు కూడా సంజయ్‌కుమార్‌ను గట్టిగా మందలించారు. 

మర్డర్స్ కు ప్లాన్ : –
ఓ వైపు బుస్రా మరొకరికి సన్నిహితంగా ఉంటుండటం, ఇంకోవైపు మక్సూద్‌, షకీల్‌, ఇద్దరు బీహారీ యువకులు మందలించడంతో.. సంజయ్‌కుమార్‌ రాక్షసుడిగా మారాడు. మక్సూద్‌  ఫ్యామిలీతో పాటు, షకీల్‌, ఇద్దరు బీహారీ యువకులపై పగ పెంచుకున్నాడు. అందరినీ అంతం చేయాలనుకున్నాడు. అయితే తనమీద ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు.

తెలివిగా ప్లాన్ : –
ఎప్పుడైతే  అంతం చేయాలనుకున్నాడో.. అప్పటి నుంచి మక్సూద్‌ కుటుంబం, షకీల్‌, బీహారీ యువకులతో మంచిగా మెలిగాడు. వాళ్లు కూడా  సంజయ్‌ మారిపోయాడని నమ్మారు. అతడితో గతంలోలాగే  మాట్లాడుతూ వచ్చారు. ఎంతో తెలివిగా తనపై నమ్మకం వచ్చేలా చేసుకున్నాడు సంజయ్‌. 

బుధవారం ముహూర్తం : –
సంజయ్‌  మంచితనమంతా తెరపైకి మాత్రమేనని వారు గ్రహించలేకపోయారు. ఆ తర్వాత అందరి హత్యలకు ప్లాన్‌ వేశాడు. తన పుట్టినరోజు అంటూ అందరినీ నమ్మించాడు. బుధవారాన్ని ముహుర్తంగా ఎంచుకున్నాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో… టాటా ఏస్‌ వాహనంతో గోడౌన్‌కు వచ్చాడు. అయితే అందులో ఎంత మంది వచ్చారు..? ఏం తీసుకువచ్చాడన్నది  మాత్రం బయటకు రాలేదు.

9 మంది హత్య: –
ఇక అప్పటికే ఆహార పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌ ఏర్పాటు చేశాడు. చివరిక్షణం వరకు కూడా తన మీద ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. అనంతరం తన ప్లాన్‌ అమలు చేశాడు. ఆ ఆహార పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌లో నిద్రమాత్రలను కలిపాడు. ఎవరెవరిని అయితే అంతం చేయాలనుకున్నాడో.. ప్లాన్‌ ప్రకారం వాళ్లకే వాటిని అందజేశాడు. అనంతరం స్రృహ కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరిని ఈడ్చుకెళ్లి బావిలో పడేశాడు. దీంతో తొమ్మిది మందిది హత్యేనని తేలింది.

ఈ ప్రశ్నలకు సమాధానం ఏదీ : –
ఈ మర్డర్‌ కేసులో కొత్తగా మరికొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 9 మందిని చంపిన సంజయ్‌… యాకూబ్‌ను మాత్రం ఎందుకు వదిలేశాడు..? యాకూబ్‌తో సంజయ్‌కు పరిచయం లేదా..? పరిచయం లేకపోవడం వల్లే యాకూబ్‌ బతికిపోయాడా..? మరోవైపు సంజయ్‌ ఒక్కడే ఈ హత్యలు చేశాడా..? అతడికి ఇంకెవరైనా  సహకరించారా..? సహకరిస్తే వాళ్లెవరు..? ఇప్పుడీ ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో పడ్డారు పోలీసులు. 2020, మే 25వ తేదీ సోమవారం సంజయ్‌ను పోలీసులు మీడియా ముందుకు తీసుకురానున్నారు. ఈ కేసులో మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు.

Read: వరంగల్ వలస కూలీలవి హత్యలే.. ఫోరెన్సిక్ నిపుణులు రజమాలిక్ అనుమానం