“పౌర”ఆందోళనలు…యూపీలో ఏడుగురు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : December 20, 2019 / 02:34 PM IST
“పౌర”ఆందోళనలు…యూపీలో ఏడుగురు మృతి

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ ఎత్తున నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇవాళ(డిసెంబర్-20,2019)కూడా ప‌లు న‌గ‌రాల్లో ఆందోళ‌న‌కారులు హింస‌కు దిగారు. ఫిరోజాబాద్, గోర‌ఖ్‌పూర్‌, కాన్పూర్,మీరట్, బులంద్‌షెహ‌ర్ లో నిర‌స‌న‌కారులు పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. బులంద్‌షెహ‌ర్ లో ఆందోళనకారులపై పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. పలువురు ఆందోళనకారులతో పాటుగా పోలీసులు కూడా గాయపడ్డారు. ఆందోళనకారులపై లీఠీ చార్జ్ కూడాచేశారు. ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో కూడా అల్ల‌ర్లు జ‌రిగాయి. అక్క‌డ 144వ సెక్ష‌న్ విధించినా.. ఆందోళ‌న‌కారులు భారీ సంఖ్య‌లో రోడ్ల‌పైకి వ‌చ్చారు.

గడిచిన 24గంటల్లో ఉత్తరప్రదేశ్ లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గురువారం లక్నోలో ఒక ఆందోళనకారుడు ప్రాణాలు కోల్పోగా,ఇవాళ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫిరోజాబాద్ లో ఒకరు,కాన్పూర్ లో ఒకరు,మీరట్ లో ఒకరు, సంభాల్ లో ఒకరు,బిజ్నోర్ లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. మరోవైపు ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దర్యాగంజ్ ఏరియాలో ఆందోళనకారులు ఇవాళ ఓ కారుకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కానన్స్ ను ఉపయోగించారు.