ఛట్ పూజల్లో అపశృతి : ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు మృతి

  • Edited By: chvmurthy , November 3, 2019 / 08:08 AM IST
ఛట్ పూజల్లో అపశృతి : ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు మృతి

బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా డియో ప్రాంతంలోని సూర్య దేవాలయం వద్ద  శనివారం సాయంత్రం జరిగిన ఛట్ పూజ ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలోఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. 

ఛట్ పూజ లో భాగంగా సూర్య భగవానునికి ఆర్ఘ్యం ఇవ్వటానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం సూర్య దేవునికి ప్రార్థనలు చేయడానికి ప్రసిద్ధ సూర్య దేవాలయానికి సమీపంలో ఉన్న ఒక పెద్ద చెరువు వద్దకు చేరుతారు.ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఈ చిన్నారులు మరణించారు. మరణించిన వారిలో 16 నెలల పసికందు కూడా ఉంది. మృతులు పాట్నాలోని భోజ్‌పురి, బిహ్తాకు చెందినవారు. తొక్కిసలాటపై జిల్లా యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది.
 
మరో సంఘటనలో, బీహార్‌లోని వైశాలి జిల్లాలోని లాల్‌గంజ్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఛట్ పూజ సందర్భంగా 14 ఏళ్ల బాలుడు గండక్ నదిలో మునిగి మరణించాడు. లఖిసరైలో మరో ఇద్దరు పిల్లలు శనివారం జరిగిన ఛట్ పూజ సమయంలో మునిగిపోయారు. నవంబర్ 3, ఆదివారం ఉదయం బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని పాత కాళీ ఆలయం వద్ద ఛట్ పూజలు నిర్వహిస్తుండగా గోడ కూలిపోయిన ఘటనలో మరో ఇద్దరు భక్తులు మృతి చెందారు.

ఛట్ పూజ మనదేశంలో ప్రధానంగా బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలవారు నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్ ఖాయ్, రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘ్య్, నాలుగవ రోజును పార్నాగా జరుపుకుంటారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్టగా నహాయ్‌ఖాయ్ ఆచరిస్తారు. ఎక్కువగా మహిళలే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఛట్ పూజ కూడా కూడా తెలంగాణలోని బతుకమ్మ పండుగ మాదిరిగానే ప్రకృతికి సన్నిహితమైనది. సకల సృష్టికి ఆధారమైన సూర్యభగవానుడిని ఈ పండుగ సందర్భంగా కొలుస్తారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి ఆర్ఘ్యప్రసాదాలను సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. వెదురు గంప లేదా చాటలో పళ్లను ఉంచి అస్తమించే సూర్యునికి, ఉదయించే సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ పూజలో ప్రధాన భాగం నదీతీరాన. సరస్సుల వద్ద జరుగుతుంది.