మహిళా ఐపీఎస్ కూ తప్పని లైంగిక వేధింపులు

మహిళా ఐపీఎస్ కూ తప్పని లైంగిక వేధింపులు

Sexual harassment of women IPS : ఏదైనా అన్యాయం జరిగినా, మహిళలు లైంగికదాడులకు గురైనా పోలీసులను ఆశ్రయిస్తాం.. కానీ ఏకంగా మహిళా ఐపీఎస్ అధికారిణికే లైగింక వేధింపులు తప్పడం లేదు. ‘కంచె చేను మేస్తే’.. అన్న చందంగా తయరైంది హోంశాఖలో కొంతమంది పోలీస్ ఉన్నతాధికారుల వ్యవవహార శైలి. హోంశాఖలో మరో పోలీస్ ఉన్నతాధికారి కీచకపర్వం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ మహిళా ఐపీఎస్‌ను డీజీపీ హోదా కల్గిన అధికారి వేధింపులకు గురిచేయడం రాజకీయంగా దుమారాన్ని రేపింది. దీంతో విచారణ కమిటీ రంగంలోకి దిగింది. ఈ కమిటీని ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం (ఫిబ్రవరి 24, 2021) ఉత్తర్వులు జారీ చేసింది.

హోంశాఖ పరిధిలోని పోలీసు విభాగంపై ఇటీవల కాలంగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో లైంగిక వేధింపులు ఎక్కువగానే ఉన్నాయి. కొంత మంది మహిళా అధికారిణిలు, కిందిస్థాయి సిబ్బంది ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నా, మరెందరో బయటకు చెప్పుకోలేక తమలో తాము కృంగిపోతున్నారు. ఫిర్యాదులు చేసుకున్నా ఫలితం శూన్యం. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ఎస్పీ స్థాయి అధికారిణికి ఐజీ స్థాయి అధికారి వేధింపులకు గురిచేయడం, విశాఖ కమిటీ రంగంలోకి దిగినా, చివరకు ఆ విచారణ తుంగలో తొక్కబడడమే.

ఈ పరిస్థితుల్లో డీజీపీ హోదా కల్గిన అధికారి ఐపీఎస్‌ అధికారిణిని తన కారులో ఎక్కమని చెప్పి, కొంత దూరం వెళ్లిన అనంతరం డ్రైవర్‌ను కిందకు దించేసి మరీ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెండు రోజులుగా ఓ ప్రచారం సోషల్ మీడియాలో హోరెత్తిస్తూ వచ్చింది. ఈ సమాచారం బుధవారం రాజకీయ వివాదంగా మారింది. ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడడంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. ఆ ఐపీఎస్‌ అధికారిణి ఇప్పటికే డీజీపీ త్రిపాఠికి ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వేధింపులపై విచారణకు కమిటీని నియమిస్తూ హోంశాఖ కార్యదర్శి ప్రభాకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

వాస్తవానికి పోలీసు బాసుల నేతృత్వంలో కమిటీ రంగంలోకి దిగాల్సి ఉంది. వేధింపులు ఇచ్చిన అధికారి డీజీపీ స్థాయి వ్యక్తి కావడంతో ఐఏఎస్‌ అధికారి జయశ్రీ రఘునందన్‌ నేతృత్వంలో ఆరుగురితో కూడిన కమిటీని రంగంలోకి దించారు. ఈ కమిటీలో అదనపు డీజీపీ సీమాఅగర్వాల్, ఐజీ అరుణ్, డీఐజీ చాముండేశ్వరి, ఐపీఎస్‌ రమేష్‌బాబు, మహిళా స్వచ్ఛంద సేవకురాలు లోరెటా జోనా ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ స్థాయి అధికారిని వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.