Nallakunta Red Cross Blood Bank Center : నల్లకుంట రెడ్‌ క్రాస్ బ్లడ్ సెంటర్‌లో దారుణం.. రక్తం ఎక్కించిన బాబుకి హెచ్ఐవీ.. అసలేం జరిగింది?

తలసేమియాతో బాధపడుతూ తరుచుగా నల్లకుంటలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ లో రక్తం ఎక్కించుకుంటున్న ఓ బాబుకి హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. అసలు లోపం ఎక్కడ తలెత్తిందో తెలుసుకోవాలని నిర్ణయించారు.

Nallakunta Red Cross Blood Bank Center : నల్లకుంట రెడ్‌ క్రాస్ బ్లడ్ సెంటర్‌లో దారుణం.. రక్తం ఎక్కించిన బాబుకి హెచ్ఐవీ.. అసలేం జరిగింది?

Nallakunta Red Cross Blood Bank Center : మూడేళ్ల పసిప్రాయం. ఆపై తలసేమియా. ప్రాణం నిలవడం కోసం రక్తం ఎక్కిస్తే.. అదే ఇప్పుడు ప్రాణాంతక వ్యాధిగా మారింది. తలసేమియా వ్యాధితో బాధపడేవారికి శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. దీంతో రక్తహీనతను అధిగమించడం కోసం రెండు వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. జీవించినంత కాలం వారికి ఇలా చేయాల్సిందే. తలసేమియా వ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడాల్సిన రక్తం.. పొరపాటున కలుషితం అయితే హెచ్ఐవీ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ చిన్నారికి సైతం ఇలాగే హెచ్ఐవీ సోకినట్లు తేలడం కలకలం సృష్టిస్తోంది.

తలసేమియా బారిన పడిన వారికి తరుచుగా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అటు వారి కోసం బ్లడ్ బ్యాంకులు దాతల నుంచి రక్తం సేకరించి భద్రపరుస్తూ ఉంటాయి. అవసరమైన వారికి ఆ బ్లడ్ ను అందిస్తుంటాయి. ఈ క్రమంలో బ్లడ్ బ్యాంకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి. దాత నుంచి రక్తం సేకరించిన తర్వాత హెచ్ఐవీ సహా పలు రకాల పరీక్షలు నిర్వహించి సురక్షితం అని నిర్ధారించుకున్న తర్వాతే అవసరమైన వారికి ఆ రక్తాన్ని అందిస్తాయి.

కాగా, తలసేమియాతో బాధపడుతూ తరుచుగా రక్తం ఎక్కించుకుంటున్న ఓ బాబుకి హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా రాంపల్లి గ్రామానికి చెందిన శివకు మూడేళ్ల బాబు ఉన్నాడు. పుట్టుకతోనే తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. డాక్టర్ల సూచనతో హైదరాబాద్ లోని నల్లకుంటా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో గత రెండున్నరేళ్లుగా ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కిస్తున్నారు. గత నెల 20న కూడా బ్లడ్ ఎక్కించారు. జులై 28న బ్లడ్ బ్యాంకు ఇచ్చిన రిపోర్టులో బాబుకి హెచ్ఐవీ నిర్దారణ అయిందని తల్లిదండ్రుల చేతిలో రిపోర్టు పెట్టారు. దీంతో బాబు తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. ఆ తర్వాత డాక్టర్ సలహాతో ముందుగా ప్రైవేట్ ల్యాబ్ లో ముగ్గురూ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బాబుకి మాత్రమే హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తల్లిదండ్రులకు నెగిటివ్ వచ్చింది. దీంతో తల్లడిల్లిన పేరెంట్స్ నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లి హెచ్ఐవీ టెస్టులు చేయిస్తున్నారు. అక్కడా బాబుకి పాజిటివ్ గా తేలింది. తల్లిదండ్రులకు నెగిటివ్ గా తేలింది. అసలే తలసేమియాతో బాధపడుతున్న బాలుడికి హెచ్ఐవీ ఉన్నదని తేలడం పిడుగుపాటుగా మారింది. తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. అసలు లోపం ఎక్కడ తలెత్తిందో తెలుసుకోవాలని అనుకున్నారు. తమ బాబుకి ఎదురైన చేదు అనుభవం మరో బిడ్డకు జరక్కూడదని అనుకున్నారు చిన్నారి తల్లిదండ్రులు.

బాబు తల్లిదండ్రులు నల్లకుంట పోలీస్ స్టేషన్ లో దీనిపై ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి దర్యాఫ్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వైద్య నిపుణుల సలహాతో పాటు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా హెచ్ఐవీ ఎలా సోకిందన్న అంశంపై దర్యాఫ్తు చేస్తున్నారు. లోపం ఎక్కడ జరిగింది? దాతల నుంచి సేకరించిన రక్తాన్ని పరీక్షించారా లేదా? టెస్ట్ చేయని బ్లడ్ ను బాబుకి ఎక్కించారా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు లేకపోయినా బాబుకి హెచ్ఐవీ ఎలా వచ్చిందన్న అంశంపై దర్యాఫ్తు చేపట్టారు. బాబుకి ఎక్కించిన బ్లడ్ ను ఎవరి నుంచి సేకరించారు అనే వివరాలు తెలుసుకుంటున్నారు. రక్త దాతకు టెస్ట్ చేయిస్తే అసలు విషయం బయటపడే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.

బాబు తల్లిదండ్రులు కేసు పెట్టిన తర్వాత బ్లడ్ బ్యాంక్ పోలీసులకు ఇచ్చిన నివేదికలో బాధిత బాలుడిని ఆరు నెలల పాటు తమ దగ్గరికి తీసుకురాలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. అది తప్పుడు నివేదిక అని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఎప్పుడెప్పుడు రక్తం ఎక్కించింది రికార్డ్ చేశారు. వాటిని పోలీసులకు ఇచ్చారు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.