Updated On - 9:30 pm, Sat, 20 February 21
Shooting Perpetrators Are Rarely Psychotic : నేరాలు ఎక్కువగా చేసేవారంతా మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారని అంటుంటారు. మానసిక సంఘర్షణ కారణంగానే ఇలాంటి సైకో నేరాలకు పాల్పడుతుంటారని భావిస్తుంటారు. వాస్తవానికి మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారి కంటే ఇతర నేరస్తులే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ఎందుకంటే.. హంతకుల్లో కేవలం 11శాతం మందికి మాత్రమే మానసిక లక్షణాల చరిత్ర ఉందంటున్నారు.
సైకలాజికల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనాన్ని కొలంబియా మాస్ మర్డర్ డేటాబేస్ ఆధారంగా నిర్వహించారు. అయితే ఇందులో 1900, 2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా జరిగిన 14,785 హత్యలకు సంబంధించిన వివరాలను విశ్లేషించారు. వాటిలో 1,315 మందిని నర హంతకులుగా గుర్తించగా మొత్తం 10,877 మంది మరణించారు. ప్రతి నేరానికి పాల్పడిన నేరస్తుడికి సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించారు. మాస్ షూటర్లలో ఎనిమిది శాతం మందికి మాత్రమే వారి జీవితంలో సైకోసిస్ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయిందని అధ్యయన నిపుణులు గుర్తించారు. తుపాకీ కాకుండా ఇతర మార్గాల్లో సామూహిక హత్యలకు పాల్పడినవారి సంఖ్య 18 శాతానికి పెరిగింది.
అలాగే పేలుడు పదార్థాలు, కాల్పులు, విషం, కత్తిపోట్లు, కొట్టడం లేదా వాహనాన్ని జనంలోకి నడపడం వంటివి నేరాలకు పాల్పడినవారు ఉన్నారు. 1970 నుంచి తుపాకీతో జరిగిన నేరాలు.. ప్రపంచవ్యాప్తంగా ఇతర సామూహిక హత్యల కంటే సాధారణంగా మారాయి. డేటాబేస్‌లో పరిశీలిస్తే.. అన్ని ఇతర హత్యలలో మూడింట రెండు వంతులు షూటింగ్ మర్డర్ లే ఎక్కువగా ఉన్నాయని తేలింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం. తుపాకీ కాల్పుల్లో ఎక్కువ భాగం అమెరికాలోనే జరిగాయి. ఈ తుపాకీ సంబంధిత దురాగతాలకు పాల్పడినవారిని నిశితంగా పరిశీలించారు. కొద్దిమంది మానసిక ధోరణులను ప్రదర్శించగా, చాలామందికి చట్టపరమైన సమస్యలు, మాదకద్రవ్యాలు, మద్యపాన అలవాటు, ఆందోళన లేదా మానసిక అనారోగ్య సమస్యల చరిత్ర ఉందని అధ్యయన రచయితలు కనుగొన్నారు.
నాన్-సైకోటిక్ న్యూరోలాజిక్ లేదా మానసిక అనారోగ్యం వంటి లక్షణాలను అనుభవించిన వారు సెమీ ఆటోమేటిక్ ఆయుధాలను ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. సైకోపాథాలజీ హిస్టరీ లేని షూటర్లు ఆటోమేటిక్ కానీ తుపాకీలను ఎక్కువగా ఉపయోగించారు. దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మాస్ షూటర్లలో తక్కువ సైకోసిస్ రేటు ఉండి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా తుపాకులను పట్టడం లేదని గుర్తించారు.