షాపు యజమాని అరెస్ట్ : వాటర్ బాటిల్ అడిగితే.. యాసిడ్ ఇచ్చాడు

  • Published By: sreehari ,Published On : October 5, 2019 / 07:44 AM IST
షాపు యజమాని అరెస్ట్ : వాటర్ బాటిల్ అడిగితే.. యాసిడ్ ఇచ్చాడు

చిన్న పొరపాటు.. అతడిని కటకటాల్లోకి నెట్టింది. వాటర్ బాటిల్స్ విక్రయించే  58ఏళ్ల షాపు యజమాని వాటర్ బాటిల్ అనుకుని కస్టమర్‌కు యాసిడ్ బాటిల్ అమ్మాడు. నీళ్లు అనుకుని కస్టమర్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని మండ్వాలి ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వెస్ట్ వినోద్ నగర్ ప్రాంతానికి చెందిన వినయ్ అనే 30ఏళ్ల వ్యక్తికి బాగా దాహం వేసింది.

సమీపంలోని ఓ జనరల్ షాపు దగ్గరకు వెళ్లాడు. వాటర్ బాటిల్ కొన్నాడు. షాపు యజమాని వాటర్ బాటిల్ అని పొరబడి యాసిడ్ బాటిల్ అతడికి ఇచ్చాడు. అప్పటికే బాగా దాహంతో ఉన్న వినయ్.. ఆ విషయం తెలియక అక్కడే తాగేశాడు. ఇంటికి వెళ్లగానే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యలు వినయ్ ను లాల్ బహుదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వాటర్ బాటిల్ అని చెప్పి యాసిడ్ బాటిల్ అమ్మినందుకు షాపు యజమానిపై మండ్వాలి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆస్పత్రిలో కోలుకున్న వినయ్ ను డిశ్చార్జి చేసినట్టు పోలీసులు తెలిపారు.