మర్డర్ మిస్టరీ : శ్రావణిని చంపింది ఎవరు

  • Published By: veegamteam ,Published On : April 28, 2019 / 04:54 AM IST
మర్డర్ మిస్టరీ : శ్రావణిని చంపింది ఎవరు

48 గంటలు ముగిశాయి. ఇంకా మర్డర్ మిస్టరీ వీడలేదు. హంతకులు ఎవరో తెలియలేదు. మర్డర్ ఎందుకు చేశారో తెలియదు. అసలేం జరిగింది అనేది ఇంకా సస్పెన్స్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన 10వ తరగతి విద్యార్థి శ్రావణి మర్డర్ కేసులో పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. శ్రావణి అత్యంత పాశవికంగా హత్యకు గురైంది. క్లాస్‌కు వెళ్లిన అమ్మాయి అదృశ్యమైంది. చివరికి శవంగా పాడుబడిన బావిలో కనిపించింది. ఇంతకీ ఆమెను చంపిందెవరు..? ఇంతటి దారుణానికి ఒడిగట్టిందెవరు?

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌ గ్రామానికి చెందిన పాముల నర్సింహా, నాగమణిల కుమార్తె శ్రావణి.. తొమ్మిదో తరగతి పూర్తి చేసింది. పదో తరగతి స్పెషల్‌ క్లాసులు మొదలవడంతో మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలోని సెరినిటి మోడల్‌ స్కూల్‌కు ఆర్టీసీ బస్సులో వెళ్లి వస్తోంది. ఇదే క్రమంలో గురువారం (ఏప్రిల్ 25,2019) ఉదయం కూడా స్కూల్‌కని వెళ్లిన శ్రావణి.. ఇంటికి తిరిగి రాలేదు. కంగారు పడిన అమ్మాయి తల్లిదండ్రులు పాఠశాలలో వాకబు చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోయిందని చెప్పడంతో గ్రామంలో చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

శ్రావణి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హాజీపూర్‌ సమీపంలో పాడుబడిన బావి పక్కన తొలుత బాలిక స్కూల్‌ బ్యాగ్‌ను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీం రంగంలోకి దిగాయి. భువనగిరి రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం (ఏప్రిల్ 26,2019) ఉదయం స్కూల్‌ బ్యాగ్ లభించగా.. రాత్రికి కాని శ్రావణి జాడ కనిపెట్టలేకపోయారు. ఆ బావికి సమీపంలోని మరో బావిలో ఆమెను పూడ్చి పెట్టినట్టు రాత్రి సమయంలో గ్రామస్థులు గుర్తించారు. ముందుగా అత్యాచారం చేసి తర్వాత హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గ్రామస్థుల సమక్షంలో శవాన్ని వెలికితీశారు.

బడికి వెళ్లిన అమ్మాయి బావిలో శవంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇటు శ్రావణి విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. బ్యాగ్ దొరికినప్పుడు చీకటి పడిపోయిందంటూ వెళ్లిపోయారు కానీ సమీపంలో వెతకలేదని ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని వెలికితీసేటప్పుడు కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రావణి హత్య కేసును పక్కదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపిస్తూ దాడికి దిగారు. రాళ్లు రువ్వడంతో డీసీపీ వాహనం అద్దాలు పగిలిపోయాయి. అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. న్యాయం జరిగేలా చూస్తామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. అలాగే కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బొమ్మలరామారం ఎస్సైనిసస్పెండ్‌ చేశారు. ఇటు శ్రావణిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని భువనగిరి రహదారిపై హాజీపూర్‌ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఓ దశలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు నచ్చచెప్పడంతో గ్రామస్థులు ఆందోళనను విరమించుకున్నారు.