మార్నింగ్ వాక్ లో గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

మార్నింగ్ వాక్ లో గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి మంచిది అంటారు. ఉదయం పూట కాసేపు నడవడం ద్వారా రక్త సరఫరా బాగుంటుందని, దేహంలోని అన్ని అవయవాలు చక్కగా పని చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలామందికి మార్నింగ్ వాక్ అలవాటు ఉంది. కొందరేమో సాయంత్రం పూట వాకింగ్ చేస్తారు. అలా చేస్తున్న వారిలో చాలామంది హెల్తీగానే ఉన్నారు. అయితే మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మృతుడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.

ఉదయపు నడక సమయంలో గుండెపోటుతో ఓ సాఫ్ట్ వేర్ మృతిచెందిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. కోల్ కతాకు చెందిన సోంనాథ్ సాహా (40) నిజాంపేట పరిధిలోని సిద్ధివినాయక్ నగర్ లో నివాసం ఉంటాడు. గచ్చిబౌలిలోని ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. రోజూ మార్నింగ్ వాక్ చేయడం అతడికి అలవాటు. రోజూలానే గురువారం(ఏప్రిల్ 23,2020) ప్రగతినగర్ అంబీర్ చెరువు దగ్గర వాకింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయాడు.

దీంతో స్థానికులు 108 కి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చేసరికి అతడు చనిపోయాడు. గుండెపోటుతోనే సోంనాథ్ మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద వయసేమీ కాదు. పైగా మార్నింగ్ వాక్ చేసే అలవాటూ ఉంది. అలాంటి వ్యక్తికి హఠాత్తుగా గుండెపోటు రావడం ఆ వెంటనే మరణించడం స్థానికులను విస్మయానికి గురి చేసింది.