ఎర్రకోట వద్ద మాపై దాడి చేసింది గూండాలు…రైతులు కాదు—గాయపడిన పోలీసులు

ఎర్రకోట వద్ద మాపై దాడి చేసింది గూండాలు…రైతులు కాదు—గాయపడిన పోలీసులు

some Goons attacked Us, Not farmers : జనవరి 26న ఢిల్లీలో జరిగిన రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆనాటి ఘటనలో సుమారు 400 మంది పోలీసులు గాయపడ్డారు. పలువురు పోలీసులు, అధికారులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. కాళ్లు చేతులు, నడుము భాగాలు విరిగి ఆస్పత్రిపాలయ్యారు.

ఇప్పటివరకు 25 మంది పై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. వారిలో 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ రోజు జరిగిన ఘటనను తలుచుకుని పోలీసులు భయానికి గురయ్యారు. రైతుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు, గూండాలు పోలీసులపై దాడికి పాల్పడినట్లు దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మారిస్ నగర్ వద్ద విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ రేఖా కుమారి పై దుండగులు దాడి చేశారు. ఆ సమయంలో ఆమె ముష్కరుల దాడినుంచి తనను తాను రక్షించుకోటానికి ఒక గ్రిల్ ఎక్కి దూకారు. అలా దూకే క్రమంలో ఆమె పక్కటెముకలు విరిగాయి. ఆమె పడిన భాదను వర్ణిస్తూ…..”పోలీసులు తమను తాము రక్షించుకోవడానికి పారిపోవటం ప్రారంభించారు.

దుండగుల దెబ్బలనుంచి నన్ను నేను కాపాడుకోటానికి చాలా చేశాను. ఆ సమయంలో ఒక గ్రిల్ దాటాను, కాని అది విరిగి నాపై పడింది. అప్పుడు చాలా మంది పోలీసులు నాపై పడ్డారు. నేను పక్కనే ఉన్న గొయ్యిలోకి దూకడం ప్రారంభించాను. వారు కూడా గోడమీద నుంచి 20 అఢుగుల లోతులో ఉన్న గోతిలోకి దూకారు.

నేను సహాయం కోసం అరుస్తున్నాను…. కాని ఎవరూ వినలేదు. ఇది 5-10 నిమిషాలు కొనసాగింది. సివిల్ దుస్తులలో ఉన్న కొంతమంది పోలీసులు,ఇతర సిబ్బంది కొంతమంది నన్ను రక్షించారు” అని ఆమె బాధతో చెప్పారు.

పోలీసు డిపార్ట్మెంట్ లో చేరిన 10 ఏళ్లలో మొదటి సారి భయపడ్డానని గుండాల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందీప్ కుమార్(32) అనే కానిస్టేబుల్ చెప్పాడు. గూండాల దాడిలో అతని ఎడమ చేయి విరిగి ఆస్పత్రి పాలయ్యాడు.”ఎర్రకోట లోపల చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడానికి నేను ఎర్రకోట గేటు వద్ద మరొక అధికారితో కలిసి ఉన్నాను. లోపల చిక్కుకున్న ప్రజలను రక్షించాలని మాకు ఆదేశాలు ఉన్నాయి.

మేము వారిని ఒక్కొక్కరిగా బయటకు తీసుకు వస్తన్నాము. అకస్మాత్తుగా, ఒక గుంపు అక్కడకు చేరుకుంది. వారు లాఠీలు, కర్రలతో మమ్మల్ని కొట్టడం ప్రారంభించారు. ఒంటరిగా ఉన్న ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను గాయపడ్డాను. నా చేతికి దెబ్బ తగిలిందని చాలా సేపటి తర్వాత నేను గ్రహించాను. మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నందున ఎవరిపైనా ఎదురుదాడి చేయలేదు. చాలా సంమనంతో వ్యవహరించాను” అని చెప్పుకొచ్చాడు.

నా సర్వీసులో చాలా నిరసన ప్రదర్శనలు చూశాను కానీ, ఇలాంటివి ఎప్పుడూ చూడలేదన్నారు జోగిందర్ రాజ్ (53) అనే ఏఎస్సై. ఎర్రకోట లోపల విధులు నిర్వర్తిస్తున్న ఆయనపై దుండగులు చేసిన దాడిలో ఎడమ చేతికి గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దుండగులు నాపై దాడి చేస్తున్నప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తున్నారో గమనించలేకపోయాను.

నా వెనుక బాగాన, భుజాలపైనా, చేతులపై, లాఠీలతో ఏకకాలంలో విపరీతంగా కొట్టారు. వారిలో ఒకరు కత్తితో దాడిచేయటానికి ప్రయత్నించారు. వారి బారినుంచి నన్ను నేను కాపాడుకోటానికి మెట్లపై నుంచి కిందకు దూకాను. నా చుట్టూ 35-40 మంది దుండగులు ఉన్నారు. 45 నిమిషాల పాటు మాపై రాళ్లు రువ్వారు. అంటూ ఆనాటి భయానక ఘటనను గుర్తు చేసుకున్నారు.