యూదుల మందిరంపై దాడి…ప్రత్యక్ష ప్రసారం చేసిన ఆగంతకుడు

  • Published By: venkaiahnaidu ,Published On : October 10, 2019 / 10:01 AM IST
యూదుల మందిరంపై దాడి…ప్రత్యక్ష ప్రసారం చేసిన ఆగంతకుడు

జ‌ర్మ‌నీలో బుధవారం ఓ ఉన్మాది యూద మందిరంపై కాల్పుల‌కు తెగబడ్డాడు. మిలిట‌రీ త‌ర‌హా దుస్తులు వేసుకున్న ఆగంతకుడు పెద్ద పెద్ద గన్స్ తో హ‌ల్లేలోని సైన‌గాగ్‌పై ఫైరింగ్ చేశాడు. మందిర ద్వారాలు తెరుచుకుని లోనికి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌లమైన ఉన్మాది…త‌న దగ్గరఉన్న ఆయుధాల‌తో స‌మీపంలో ఉన్న వారిపై ఫైరింగ్ జ‌రిపాడు. ఆ కాల్పుల్లో ఓ మ‌హిళ‌తో పాటు మ‌రో వ్య‌క్తి మృతిచెందారు.

అయితే ఆ ఆగంత‌కుడు ఈ ఘాతుకాన్ని ఆన్‌లైన్‌లో లైవ్‌స్ట్రీమ్ చేశాడు. సుమారు 35 నిమిషాల పాటు త‌న కిరాత‌క చ‌ర్య‌ను ట్విచ్ వీడియోగేమ్ ఫ్లాట్‌ఫాంలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశాడు. సారీ గయ్స్  గన్ మిస్ ఫైర్ అయింది అంటూ అతడు లైవ్ లో మాట్లాడాడు. అతివాద తీవ్ర‌వాదాన్ని ప్ర‌చారం చేసేందుకు ఆ ఉన్మాది ఈ చ‌ర్య‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది. మందిరంలోకి వెళ్లేముందు 27 ఏళ్ల ఉన్మాది… యూద మ‌త‌స్థుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశాడు. ఆ వ్య‌క్తి స్వ‌తంత్రంగానే ఉన్మాదానికి దిగిన‌ట్లు పోలీసులు గుర్తించారు. 

కాల్పుల్లో మృతిచెందిన ఇద్ద‌రి కుటుంబ‌స‌భ్యుల‌కు జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ మెర్క‌ల్ సంతాపం ప్ర‌క‌టించారు. ఆగంత‌కుడు ఆయుధాల‌తో దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ నిఘా కెమెరాల‌కు చిక్కాయి. కాల్పుల స‌మ‌యంలో ప్రార్థ‌నా మందిరంలో సుమారు 80 మంది వ‌ర‌కు ఉన్నార‌ని తెలుస్తోంది. యూదుల ప‌విత్ర దినం రోజున ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది.   దాడికి సంబంధించిన వీడియోను డిలీట్ చేసిన‌ట్లు ట్విచ్ సంస్థ తెలిపింది. కానీ దాన్ని అప్ప‌టికే వేల‌మంది చూశారు. అనుమానితుడిగా భావిస్తున్న ఒకరిని జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తలపై కెమెరా పెట్టుకుని ఆగంతకుడు ఈ ఎటాక్ ని రికార్డ్ చేశాడని జర్మనీ సెక్యూరిటీ అధికారి తెలిపారు. 

ఆన్‌లైన్ లైవ్ ఫ్లాట్‌ఫామ్‌ల‌ను వాడుకుని కాల్పుల‌కు దిగుతున్న ఘ‌ట‌న ఇటీవల కాలంలో ఇది రెండ‌వ‌సారి. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చ‌ర్చ్ మ‌సీదులోకి వెళ్లిన ఓ ఆగంత‌కుడు కాల్పులు జ‌రిపి 51 మందిని హ‌త‌మార్చిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌ను అత‌ను ఫేస్‌బుక్‌లో లైవ్ ఇచ్చిన విషయం తెలిసిందే.