స్ట్రీట్ ఫైట్ : చార్మినార్ వద్ద గుండారాజ్

  • Published By: madhu ,Published On : January 27, 2019 / 10:20 AM IST
స్ట్రీట్ ఫైట్ : చార్మినార్ వద్ద గుండారాజ్

హైదరాబాద్ : ‘అంకుశం’ సినిమా చూశారా ? అందులో విలన్ రాంరెడ్డిని హీరో ఇన్స్‌పెక్టర్ రాజశేఖర్ బట్టలు ఊడగొట్టి లాఠీలతో బాదుతూ చార్మినార్ నుండి ఈడ్చుకెళుతుంటాడు. సరిగ్గా ఇలాంటి ఘటనే రీల్ లైఫ్‌లో చోటు చేసుకుంది. చిన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ఇనుప రాడ్ లతో ఒకరిపై ఒకరు ఇష్టం వచ్చినట్టు దాడి చేసుకున్నారు. అంతేకాదు.. ఎదురుగా ఉన్న దుకాణంలోని వస్తువులు పగుల కొట్టారు. లైవ్‌గా చూస్తున్న వారందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనతో చార్మినార్ పరిసరాలు ఉలిక్కి పడ్డాయి. ఈ ఘటన హుస్సేనీహాలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళితే… బార్కాస్‌కు చెందిన సయ్యద్ బిన్ అహ్మద్ సాది, సాదం బిన్ సాదిలు చార్మినార్ ఫరాషా హోటల్ ఎదురుగా తోపుడు బండ్లపై చిరు వ్యాపారస్తులు. రెయిన్ బజారుకు చెందిన సలీం కూడా అక్కడే చిరు వ్యాపారి. ఎప్పటి లాగానే శనివారం ఉదయం కూడా సలీం తోపుడుబండి నుంచి తమ బండికి ఎండ రాకుండా టెంట్ వేసుకున్నారు. సాయంత్రం అయినా.. రాత్రి అయినా వేసుకున్న టెంట్ తీయక పోవడంతో సలీం నిలదీశాడు. దీంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. మాట మాట పెరిగింది… ఆగ్రహించిన సయ్యద్ బిన్ అహ్మద్ సాది, సాదం బిన్ సాదిలు సలీంపై ఇనుప రాడ్‌లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సలీం హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశాడు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు సయ్యద్ బిన్ అహ్మద్ సాది, సాదం బిన్ సాదిలపై 324 రెడ్ విత్ 34 IPC  సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.