సెల్‌ఫోన్‌కి దూరంగా ఉండాలన్న డాక్టర్, గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి

  • Published By: naveen ,Published On : August 17, 2020 / 03:23 PM IST
సెల్‌ఫోన్‌కి దూరంగా ఉండాలన్న డాక్టర్, గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి

సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పడంతో తట్టుకోలేకపోయిన ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఈ ఘటన జరిగింది. విద్యార్థి పేరు నరేంద్ర. పాలిటెక్నిక్ చదువుతున్నాడు. కాగా లాక్ డౌన్ కారణంగా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం నరేంద్ర అనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు నరేంద్రను డాక్టర్ కి చూపించారు. స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండాలని డాక్టర్ సూచించాడు.



డాక్టర్ సూచన మేరకు నరేంద్ర తల్లిదండ్రులు అతడి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ లాక్కున్నారు. తన ఫోన్ తనకు ఇవ్వాలని నరేంద్ర తల్లిదండ్రులను అడిగాడు. అయినా వారు ఒప్పుకోలేదు. దీంతో నరేంద్ర బెదిరింపులకు దిగాడు. ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. కాసేపు మారం చేసి నరేంద్ర ఊరుకుంటాడని తల్లిదండ్రులు భావించారు. కానీ నరేంద్ర అన్నంత పని చేశాడు. బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులు నరేంద్రను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



పిల్లలు, యువత స్మార్ట్ ఫోన్లకు ఏ రేంజ్ లో బానిసలయ్యారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా ఉండగలుగుతున్నారు, కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క సెకను కూడా ఉండలేకపోతున్నారు. మేలుకున్నా, పడుకున్నా నిత్యం ఫోన్ దగ్గర ఉండాల్సిందే. అంతగా ఫోన్ కి బానిసలుగా మారారు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. తిండి తిప్పలు మానేసి అదే పనిగా సెల్ ఫోన్ తో గడిపేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించినా, మంచి మాటలు చెప్పినా తట్టుకోలేకపోతున్నారు. మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు.