శ‌ర‌వ‌ణ‌ హోటల్స్ యజమాని క్రైం స్టోరీ : జ్యోతిష్యుడు చెప్పాడని.. ఉద్యోగి భార్యపై కన్నేశాడు

అప్పట్లో సంచలనం సృష్టించిన ప్రిన్స్ శాంతాకుమార్ హత్యకేసులో నిందితుడైన సౌత్ ఇండియన్ రెస్టారెంట్ శరవణా భవన్ యజమాని పి రాజగోపాల్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.

  • Published By: sreehari ,Published On : March 30, 2019 / 12:14 PM IST
శ‌ర‌వ‌ణ‌ హోటల్స్ యజమాని క్రైం స్టోరీ : జ్యోతిష్యుడు చెప్పాడని.. ఉద్యోగి భార్యపై కన్నేశాడు

అప్పట్లో సంచలనం సృష్టించిన ప్రిన్స్ శాంతాకుమార్ హత్యకేసులో నిందితుడైన సౌత్ ఇండియన్ రెస్టారెంట్ శరవణా భవన్ యజమాని పి రాజగోపాల్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.

తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రిన్స్ శాంతాకుమార్ హత్యకేసులో నిందితుడైన సౌత్ ఇండియన్ రెస్టారెంట్ శరవణ భవన్ యజమాని పి.రాజగోపాల్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన జీవిత ఖైదు శిక్షను సుప్రీం కోర్టు సమర్థించింది. 18ఏళ్ల క్రితం జరిగిన హత్యకు సుప్రీంకోర్టు తీర్పుతో శరవణ పి.రాజగోపాల్ కథ ముగిసింది. 72 ఏళ్ల రాజగోపాల్ కోర్టు ఎదుట లొంగిపోయేందుకు జులై 7 వరకు గడవు ఇచ్చింది. జైలుకెళితే.. జీవితాంతం అక్కడే ఉండాలి.

మూడో భార్యగా చేసుకోవాలని  :
ప్రిన్స్ శాంతా కుమార్ ను కిడ్నాప్ చేసి హత్య చేయించిన రాజగోపాల్.. అతడి భార్యను.. తాను మూడో భార్యగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శాంతా కుమార్ ను హత్య చేసేందుకు పథకం రచించాడు. అతన్ని కిడ్నాప్ చేయించి 2001లో శాంతా కుమార్ ను హత్య చేయించాడు. అనంతరం ప్రిన్స్ భార్య జీవజ్యోతిని కూడా తన అనుచరులతో కిడ్నాప్ చేయించాడు. జీవజ్యోతి అక్కడి నుంచి తప్పించుకుని.. జనవరి 31, 2001లో కంప్లయింట్ చేసింది. తన భర్తను రాజగోపాల్ కిడ్నాప్ చేసి హత్య చేయించి ఉంటాడని చెప్పింది. ఇక్కడే శరవణ అరాచకం వెలుగులోకి వచ్చింది.

జాతకాలపై నమ్మకమే :
జాతకాలను నమ్మే రాజగోపాల్.. ఓ జ్యోతిష్యుడు చెప్పినట్టు జీవజ్యోతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అలా చేస్తే.. ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకడు అవుతాడని నమ్మాడు. అప్పటికే జీవజ్యోతి తండ్రి రామస్వామి.. శరవణ రాజగోపాల్ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. అదే సమయంలో జీవజ్యోతి సోదరుడు రామ్ కుమార్ కి ట్యూషన్ చెప్పేందుకు టీచర్ గా ప్రిన్స్ శాంతా కుమార్ (తర్వాత ఆమె భర్త) ఎంట్రీ ఇచ్చాడు. అలా వారి పరిచయం ప్రేమగా మారింది. ఇదే కథ మలుపు తిరిగింది. శరవణ యజమాని రాజగోపాల్.. జ్యోతిష్యుడి చెప్పినట్లుగా జీవజ్యోతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన దగ్గర పని చేసే జ్యోతి తండ్రికి చెప్పాడు. అతను అంగీకరించలేదు. ఈ విషయంలో ఇంట్లో గొడవలు జరిగాయి. అప్పటికే ప్రేమలో ఉన్న జీవజ్యోతి విషయాన్ని శాంతాకుమార్ కు చెప్పింది. మద్రాస్ లోనే ఉంటే శరవణ పలుకుబడి, డబ్బుతో విడదీసే ప్రమాదం ఉందని భావించి.. ఇద్దరూ మధురై పారిపోయారు. జీవజ్యోతి ద్వారా ప్రపంచ కుబేరుడు కావాలని కలలు కన్న శరవణ రాజగోపాల్ వారిద్దరిని పట్టుకుని నిర్బంధించాడు.

భర్తను హత్యచేసి.. భార్యను నిర్బంధించి :
శాంతాకుమార్ బతికి ఉంటే జీవజ్యోతి ఎప్పటికీ తనది కాదని భావించిన రాజగోపాల్.. అతన్ని చంపిస్తాడు. ప్రిన్స్ శాంతాకుమార్ మృతదేహాన్ని కొడైకొనాల్ కొండల్లోని టైగర్ షోలాలో పడేస్తారు. శాంతాకుమార్ అడ్డు తొలగిపోయిందని భావించిన రాజగోపాల్ .. అప్పటి నుంచి జీవజ్యోతిని బెదిరించాడు. పెళ్లికి బలవంతం పెట్టాడు. నిర్బంధించాడు. చివరికి ఆమెను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజగోపాల్ పై కేసు నమోదు అయింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు రాజగోపాల్ ను సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరుపరిచారు. 

రాజగోపాల్ కు శిక్ష ఖరారు :
జనవరి 31, 2001 : తన భర్త కనిపించడం లేదంటూ భార్య జీవజ్యోతి వెలచెరి పోలీసులను ఆశ్రయించింది. 
అక్టోబర్ 2001 : శాంతా కుమార్ మృతదేహన్ని కొడైకొనాల్ కొండల ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. 
నవంబర్ 2001 : శాంతా హత్యకేసులో జీవజ్యోతి ఫిర్యాదుతో రాజగోపాల్, అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
2004 : శాంతాకుమార్ హత్య కేసుపై విచారించిన పూనమల్లె స్పెషల్ కోర్టు నిందితుడు రాజగోపాల్ కు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది.
2009 : మద్రాసు హైకోర్టు శాంతా కుమార్ హత్యకేసులో నిందితుడైన రాజగోపాల్ జైలు శిక్షను జీవిత ఖైదు మార్చింది. 
మార్చి 29, 2019 : శాంతా హత్యకేసుపై విచారించిన సుప్రీంకోర్టు మద్రాసు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.