దారి తప్పిన పోలీస్.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు

  • Published By: naveen ,Published On : November 9, 2020 / 11:32 AM IST
దారి తప్పిన పోలీస్.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు

police four marriages: అతడు చేసేది పోలీస్‌ ఉద్యోగం. ఎవరైన తప్పు చేస్తే వారికి బుద్ధి చెప్పడం అతడి పని. కానీ…ఇది తప్పు అని చెప్పాల్సినోడే.. తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా నలుగురు మహిళల్ని మోసం చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరి మెడలో తాళి కట్టి నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తాడు. పోలీస్‌ వృత్తికే మాయని మచ్చని తెచ్చాడు.

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా నాలుగు పెళ్లిళ్లు.. నిత్య పెళ్లి కొడుకు అవతారమెత్తిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌.. విడాకులు తీసుకోకుండానే పెళ్లి మీద పెళ్లిళ్లు..ఒకరికి తెలియకుండా మరొకరి మెడలో తాళి..


నలుగురిని మోసం చేసిన కానిస్టేబుల్‌:
పేరు రావుల మహేశ్‌ అలియాస్‌ మల్లయ్య. చేసేది పోలీస్‌ వృత్తి. తప్పు చేస్తున్న వారికి బుద్ధి చెప్పాల్సిందిపోయి… అతడే తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు ఉద్యోగంలో ఉండి కూడా… మహిళలను మోసం చేస్తూ వచ్చాడు. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా నలుగుర్ని మోసం చేశాడు. భర్త వ్యవహారం తెలుసుకున్న రెండో భార్య ఫిర్యాదుతో.. నిత్య పెళ్లికొడుకి బాగోతం వెలుగులోకి వచ్చింది.

మహేష్ పై వరకట్న వేధింపుల కేసు:
సూర్యాపేట జిల్లాలోని మద్దిరాల మండలానికి చెందిన రావుల మహేశ్‌ అలియాస్‌ మల్లయ్య సూర్యాపేట ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2014లో మోతె మండలానికి చెందిన ఒక యువతిని వివాహం చేసుకున్నాడు. విభేదాలు రావటంతో విడాకులు తీసుకున్నారు. తరువాత 2016లో చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన స్రవంతిని మరో పెళ్లి చేసుకున్నాడు. గర్భం దాల్చిన భార్యను అపురూపంగా చూసుకోవాల్సిన ఇతగాడు… ఆమెను తరచూ వేధించేవాడు.
https://10tv.in/jawans-applaud-as-terrorist-in-jk-surrenders/
దీంతో భర్త వేధింపులు భరించలేక స్రవంతి పుట్టింటికి వెళ్లిపోయింది. తరువాత ఆమె మగబిడ్డకు ప్రసవించింది. కొడుకుని చూడటానికి కూడా మహేశ్ వెళ్లలేదు సరికదా భార్యకు ఫోన్ చేసి వేధిస్తుండేవాడు. దీంతో స్రవంతి చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మహేష్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో కొనసాగుతుంది.

యువతిని ఇంట్లో నుంచి తీసుకెళ్లి గుడిలో పెళ్లి:
సీన్‌ కట్‌ చేస్తే…ఆరు నెలల క్రితం ఓ యువతిని ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయి సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. దీనిపై ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు తమ కూతురు కనిపించట్లేదంటూ మిస్సింగ్ పెట్టారు. ఈ కేసులో పోలీసులు మహేశ్‌తో పాటు ఆ యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆ యువతిని సఖి కేంద్రానికి తరలించారు. ఆ తరువాత నచ్చచెప్పి ఆ యువతి తల్లిదండ్రులు తమతో తీసుకెళ్లిపోయారు.


2020 అక్టోబర్‌ 29న నాలుగో పెళ్లి:
ఆ తరువాత మహేశ్ మరో పెళ్లికి సిద్దపడ్డాడు. అక్టోబర్ 29న మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మహేష్ రెండో భార్య స్రవంతికి తెలిసింది. తనకు న్యాయం చేయకుండా పెళ్లి మీద పెళ్లి చేసుకుంటున్నాడంటూ మరోసారి పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆధారాలు లేవనే కారణంతో తామేమి చేయలేమని చేతులెత్తేశారు పోలీసులు. పెళ్లి ఫొటోలు చూపించినా పట్టించుకోవడం లేదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు ఇప్పటికైనా కేసు నమోదు చేసుకుని.. తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటోంది. మరి పోలీసులు ఆ నిత్య పెళ్లికొడుకుపై చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తారా.. లేదంటే ఆధారాలు లేవని వదిలేస్తారా..అన్నది చూడాలి.