వనపర్తి జిల్లాలో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా నలుగురు మృతి…విష ప్రయోగం జరిగినట్లు అనుమానం

  • Published By: bheemraj ,Published On : August 14, 2020 / 07:32 PM IST
వనపర్తి జిల్లాలో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా నలుగురు మృతి…విష ప్రయోగం జరిగినట్లు అనుమానం

వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగ్ పూర్ లో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా మృతి చెందిన నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. విష ప్రయోగం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. వారే ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఎవరైనా విష ప్రయోగం చేశారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఘటనపై ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నాగ్ పూర్ లో ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఘటనపై పోలీసులు ఉదయం నుంచి విచారణ కొనసాగిస్తున్నారు. రేవల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. వారు రాత్రి నుంచి ఏమీ తిననట్లుగా నివేదికలో ప్రాథమిక సమాచారం. విష ప్రయోగం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. బంధువులను కూడా విచారించనున్నారు.

క్షుద్రపూజలు చేయడానికి మూడో వ్యక్తి ఎవరైనా వచ్చారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాలు చెల్లచెదరుగా పడి ఉన్నాయి. రక్తపు మరకలు ఉన్నాయి. వీటిపై బంధువులు పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్షుద్రపూజలకు వచ్చిన వారు కావాలనే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని, వారిని ఏదైనా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సివుంది.

2014లో ఒకసారి ఇలాంటి ఘటనకు పాల్పడటం, వారంతా కొంతకాలం గ్రామాన్ని వదిలి పెట్టి వేరే ఊరికి వెళ్లారు. గతంలో క్షుద్ర పూజలు జరిపి గుప్త నిధులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటన ఇప్పుడు మరోసారి చోటుచేసుకుంది. కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన పరిస్థితి నెలకొంది. దీనిపై పలు సందర్భాల్లో వారి కుటుంబీకుల్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తవ్వకాల కోసం గతంలో రెండు, మూడు సార్లు కొత్త వారు మృతుల ఇంటికి వచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

అజీరాం బీ(63), ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా (10) అనుమానస్పదంగా చనిపోయారు. ఇంట్లో వీరంతా హాల్‌, డైనింగ్ హాల్, వంటగది, ఇంటి వెనకలా ఇలా అంతా వేర్వేరు ప్రాంతాల్లో చనిపోయి ఉన్నారు. దీంతో ఇది ఆత్మహత్యా, హత్యా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

నిమ్మకాయలు, పసుపు కుంకుమ, అగర బత్తీలు ఉండటంతో పాటు ఇంటి ఆవరణలో పలుచోట్ల గుంతలు తవ్వి ఉండటం పోలీసులు గుర్తించారు. దీంతో క్షుద్రపూజలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.