తహశీల్దార్ సజీవదహనం కేసు : పోలీసుల విచారణలో కొత్త విషయాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితుడు సురేష్ కుటుంబసభ్యులను

  • Published By: veegamteam ,Published On : November 5, 2019 / 09:30 AM IST
తహశీల్దార్ సజీవదహనం కేసు : పోలీసుల విచారణలో కొత్త విషయాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితుడు సురేష్ కుటుంబసభ్యులను

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితుడు సురేష్ కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. అలాగే సురేష్ కాల్ డేటాను పోలీసులు చెక్ చేస్తున్నారు. తహశీల్దార్ ఆఫీస్ కి వెళ్లే ముందు సురేష్ తన అన్న దుర్గయ్యతో ఫోన్ లో పలుమార్లు మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడితో ఏం మాట్లాడాడు అని ఆరా తీస్తున్నారు.

భూ వివాదంలో రైతు సురేష్ తహశీల్దార్ విజయను హత్య చేశాడని పోలీసులు చెబుతుండగా.. సురేష్ కుటుంబసభ్యులు మాత్రం మరోలా వాదిస్తున్నారు. హత్య చేయాల్సిన అవసరం సురేష్ కి లేదని తేల్చి చెబుతున్నారు. సురేష్ ను ఎవరైనా ప్రేరేపించి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

పోలీసులు విచారణలో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సురేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. దాడికి ముందు సురేష్ మద్యం సేవించాడా అనే యాంగిల్ లోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. అదే సమయంలో స్థానిక రాజకీయ నేత వ్యవహారంపైనా పోలీసులు విచారణ చేపట్టారు. 

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి ఆఫీస్ లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నిందితుడు సురేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో తహశీల్దార్‌ విజయ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం(నవంబర్ 4,2019) మధ్యాహ్న భోజన విరామ సమయంలో తహశీల్దార్‌ చాంబర్‌లోకి వెళ్లిన సురేష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.

వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే తహశీల్దార్ ని సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేష్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. విజయారెడ్డిపై దాడి తర్వాత.. సురేశ్‌ తనకు తాను నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడు కూడా గాయపడ్డాడు.

బాచారంలోని 412 ఎకరాల భూమి 70 ఏళ్లుగా వివాదాల్లో ఉంది. మహారాష్ట్రకు చెందిన రాజా ఆనందరావు పేరిట ఉన్న ఈ భూమిలో 130 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం భూప్రక్షాళన అనంతరం అతడు తమకు విక్రయించాడని సయ్యద్‌ యాసిన్‌ వారసులు తెరపైకి వచ్చారు. అయితే వివాదంలో ఉన్న ఆ భూమిని పలు కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. ఇందులో నిందితుడు సురేష్‌ కుటుంబం కూడా ఉంది.

ఈ క్రమంలోనే తమకు చెందిన భూమిని వేరొకరికి బదిలీ చేశారంటూ రైతు కుటుంబాలు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాయి. కాగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో ఈ భూమి ఉండటంతో కబ్జాదారులు దీనిని దక్కించుకునేందుకు స్కెచ్ వేశారు. ఈ భూకబ్జాలో పలువురు రాజకీయ నేతల హస్తం కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూమి వివాదంలోనే తహశీల్దార్ విజయారెడ్డిని రైతు సురేష్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. కాగా, ఈ వివాదాస్పద భూమి విలువ రూ.40 కోట్లు అని తెలుస్తోంది.