ఎస్సైని లారీ తో గుద్ది చంపిన డ్రైవర్

ఎస్సైని లారీ తో గుద్ది చంపిన డ్రైవర్

Drunkard warned for brawl runs over sub-inspector in Tuticorin : తమిళనాడులో దారుణం జరిగింది. తాగి వాహానం నడపొద్దని, వాహనాన్ని సీజ్ చేసినందుకు ఎస్సైని లారీ తో గుద్ది చంపాడు డ్రైవర్. తూత్తుకుడి పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కోరక్కై ప్రాంతంలోని ఒక హోటల్ వద్ద ఘర్షణ జరిగింది. తాగి ఉన్న లారీ డ్రైవర్ కు, హోటల్ సిబ్బందికి మధ్య వివాదం మొదలైంది.

పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు గొడవ సర్దుమణిగేందుకు ఇద్దరికి సర్ది చెప్పబోయారు. కానీ ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న లారీ డ్రైవర్ మురుగవేల్ అందుకు ఒప్పుకోక పోలీసులతోనూ వాగ్వాదానికి దిగాడు. దీంతో ఎస్సై బాలు (55), మురుగవేలు నడుపుతున్న లారీ తాళాలు తీసుకుని రేపు ఉదయం స్టేషన్ కు వచ్చి తాళాలు తీసుకెళ్లమని ఆదేశించాడు.

అక్కడి గొడవ సర్దుమణిగిన తర్వాత ఎస్సై వేరోక కానిస్టేబుల్ సుబ్బయ్య(35) తో తనబైక్ పై   బయలుదేరాడు.  లారీ  తాళాలు తీసుకున్నాడని ఎస్సై పై కోపం పెంచుకున్న మురుగవేల్ వేరొక లారీ తీసుకుని,  వేగంగా  నడుపుతూ ఎస్సై నడుపుతున్న బైక్ పైకి పోనిచ్చాడు. దీంతో ఎస్సై బాలు లారీ కిందపడి మరణించాడు. అతని వెంట ఉన్నకానిస్టేబుల్ సుబ్బయ్యకు కాలు విరిగింది.

అనంతరం ఆ లారీని అక్కడే వదిలేసి మురుగువేల్ పారిపోయాడు. మురుగవేల్ ను పట్టుకునేందుకు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేసారు. కాగా సోమవారం ఉదయం డ్రైవర్ మురుగవేల్ వేలాత్తికుళం మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయాడు. మెజిస్ట్రేట్ అతడ్ని 5 రోజుల రిమాండ్ విధించారు. ఫిబ్రవరి5న శ్రీవైకుంఠం కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.

ఎస్సై బాలు కుటుంబానికి తమిళనాడు ప్రభుత్వం రూ. 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తూత్తుకుడి జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై   ప్రజలు దాడి చేయటం ఇటీవల పరిపాటి అయ్యింది. గత ఆగస్టు నెలలో శ్రీవైకుంఠం ప్రాంతానికి చెందిన రౌడీ గ్యాంగ్ జరిపిన నాటు బాంబు దాడిలో ఒక పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు.