టీచర్ కొట్టిన దెబ్బలకు దెబ్బతిన్న ఊపిరితిత్తులు, గుండె.. 8రోజులు కోమాలో

టీచర్ కొట్టిన దెబ్బలకు దెబ్బతిన్న ఊపిరితిత్తులు, గుండె.. 8రోజులు కోమాలో

చదువు నేర్పే స్కూళ్లే చిత్రహింసలు పెడుతుంటే విద్యా బుద్ధులు కాదు కదా.. బతకడానికి కూడా పనికి రాకుండా పోతున్నారు చిన్నారులు. ఆధ్మాత్మిక విద్యను బోధించే పాఠశాలలో భగవాన్ మహారాజ్ పొవనె అనే టీచర్ కొట్టిన దెబ్బలు బాలుడి ప్రాణాల మీదకు తెచ్చాయి. అదృష్టం కొద్దీ ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. విషమమైన పరిస్థితిలో హాస్పిటల్ లో చేర్చగా ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. 

ఆ చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. 45ఏళ్ల టీచర్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదైంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఓం చౌదరి అనే వ్యక్తి అలాండిలోని శ్రీ మౌళి గ్యాన్‌రాజ్ క్రిపా ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. టీచర్ చెప్పిన హరిపాట్‌ను చదవలేకపోయాడు. దాంతో టీచర్ కమ్ ఫౌండర్ అయిన పొవానె విద్యార్థిని పలు మార్లు కిందకు తోసేశాడు. 

తర్వాతి రోజు పాఠశాలలోని విద్యార్థుందరినీ ఔరంగబాద్‌లోని కీర్తన్ సెషన్ లో పాల్గొనేందుకు తీసుకెళ్లాడు. అక్కడికి చిన్నారి రాలేనని చెప్పినా వినకుండా తీసుకెళ్లారు. ఉన్నట్టుండి కుప్పకూలిపోవడంతో ఆ తర్వాత తల్లికి సమాచారం అందించి మీ అబ్బాయి ఆరోగ్యం బాలేదు.. ఔరంగబాద్ వచ్చి తీసుకెళ్లండి అని చెప్పారు. 

‘రెండేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. చదువు నేర్పించడానికి నా కొడుకుని శ్రీ మౌళి గ్యాన్‌రాజ్ క్రిపా ప్రసాద్ కు పంపించాను. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో ఔరంగాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఆరోగ్యం బాలేదు తీసుకెళ్లమని ఫోన్ రావడంతో సోదరుడ్ని తీసుకుని అక్కడికి వెళ్లాను. స్పృహ కోల్పోయిన నా కొడుకుని తీసుకుని నేను పనిచేసే చోటుకు దగ్గర్లో ఉన్న హాస్పిటల్ లో చేర్పించాం. 8రోజుల తర్వాత మాలోకి వచ్చాడు’ అని ఆ విద్యార్థి తల్లి వాపోయింది. 

స్పృహలోకి వచ్చిన విద్యార్థి టీచర్ తన కాళ్లు.. చేతులు కట్టేసి పాఠాలు కంఠస్థం చేయాలంటూ భయపెట్టేవాడని చెప్పాడు. తర్వాతి రోజు నాకు బాగాలేదని చెప్తున్నా.. పట్టించుకోకండా ఔరంగబాద్ తీసుకెళ్లారు. తినమని ఆహార పదార్థం ఇచ్చారు. అనారోగ్యంగా ఉందని చెప్పినా వినకుండా బలవంతంగా పట్టించారు. కాసేపటిలోనే కళ్లు తిరిగిపడిపోయా అని విద్యార్థి చెప్పాడు. 

ఈ ఘటనపై పోలీసులకు కంప్లైంట్ చేయడానికి వెళ్తే ముందుగా తిరస్కరించారట. బంధువులను పిలిపించి సమస్య పెంచుకోవద్దని వారించారు. ‘చిన్నారి వైద్యానికి సరిపడ ఖర్చులు మేమే భరిస్తాం. డాక్టర్ రిపోర్టు మార్చి ఇమ్మని చెప్పారు’ అని తల్లి చెప్పింది. 

బాలుడి తల్లి పనిచేసే హాస్పిటల్ లోనే చికిత్స అందించారు. చేర్పించుకున్న సమయంలో పరిస్థితి విషమంగా ఉంది. మెదడు, గుండెతో పాటు అంతర్గతంగా పలు అవయవాలు దెబ్బతిన్నాయి. 8రోజుల కోమా అనంతరం ప్రాణానికి ప్రమాదం లేదు త్వరలోనే కోలుకుంటాడని వైద్యులు చెప్పారు.