10th విద్యార్థినిపై అత్యాచారయత్నం : ఉపాధ్యాయుడి సస్పెన్షన్

  • Published By: madhu ,Published On : March 29, 2019 / 02:14 AM IST
10th విద్యార్థినిపై అత్యాచారయత్నం : ఉపాధ్యాయుడి సస్పెన్షన్

విద్యార్థులను సక్రమమార్గంలో నడిపించాల్సిన టీచర్లు దారి తప్పుతున్నారు. సభ్యసమాజం తలదించుకొనేలా వ్యవహరిస్తున్నారు కొందరు పంతుళ్లు. విద్యార్థినులపై అత్యాచారయత్నాలకు పాల్పడుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ ఉపాధ్యాయుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్‌పై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. కేసు పెడితే పరువు పొతుందని కొందరు చెప్పి..బయటకు విషయం పొక్కకుండా బాధిత కుటుంబానికి కొంత డబ్బు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను తెలుసుకున్న కలెక్టర్ వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సదరు ఉపాధ్యాయుడిని విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 

సూర్యాపేట జిల్లాలోని 60 అడుగుల రోడ్డులోని పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థిని ఎగ్జామ్ రాస్తోంది. పాండ్యా నాయక్ తండా గవర్నమెంట్ స్కూల్‌కి చెందిన టీచర్ నర్సింహస్వామి ఇన్విజిలెటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ విద్యార్థిని ప్రలోభ పెట్టాడు. మెరుగైన ఫలితాలు వచ్చేందుకు సహకరిస్తానని మాయ మాటలు చెప్పాడు. పరీక్ష అనంతరం ఆమెను బైక్‌పై ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ప్రతిఘటించిన విద్యార్థిని బయటకు పరుగులు తీసి ఇంటికెళ్లి జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించింది.

విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడికి చెందిన కొంతమంది బాధితురాలి కుటుంబంతో చర్చలు జరిపారు. కేసు పెడితే విద్యార్థిని పరువు పోతుందని..ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పినా వారు వినిపించుకోలేదదని తెలుస్తోంది. ఘటన బయటకు పొక్కకుండా ఉండేందుకు కొంత నగదు ముట్టచెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కలెక్టర్ అమయ్ కుమార్‌కి విషయం తెలిసింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని డీఈవో, ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. సదరు ఉపాధ్యాయుడు నర్సింహస్వామిని విద్యాశాఖాధికారులు సస్పెండ్ చేశారు.