ఈఎస్ఐ కుంభ‌కోణం కేసు : 4 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఏసీబీ

  • Published By: sreehari ,Published On : September 1, 2020 / 06:23 PM IST
ఈఎస్ఐ కుంభ‌కోణం కేసు : 4 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఏసీబీ

తెలంగాణ రాష్ర్టంలో సంచ‌ల‌నం సృష్టించిన‌ ఈఎస్ఐ కుంభ‌కోణం కేసులో భారీ స్థాయిలో ఆస్తులను సీజ్ చేసింది ఏసీబీఐ. దాదాపు రూ. 4 కోట్ల విలువైన ఆస్తుల‌ను అవినీతి నిరోధ‌క శాఖ‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌ధాన నిందితుల్లో ఐఎంఎస్ డైరెక్ట‌ర్ దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగ‌ల‌క్ష్మికి చెందిన రూ. 4 కోట్ల ఆస్తుల‌ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ గుర్తించింది.




స్థిరాస్తి రంగంలో నిందితులిద్ద‌రూ పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు ఏసీబీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. స్థిరాస్తి వ్యాపారి వ‌ద్ద నుంచి రూ. 4 కోట్లు స్వాధీనం చేసుకున్న అనంతరం స్థిరాస్తి వ్యాపారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఐఎంఎస్‌లో దేవికారాణి ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రేటు కాంట్రాక్ట్‌ (RC) ప్రకారం లక్షల విలువైన పర్చేజ్‌ ఆర్డర్‌కు నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ (NRC)లో కోట్లు చెల్లించి దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొనాల్సిన మందులను గుర్తించేలా పర్చేజ్‌ ఆర్డర్‌లో పెద్ద అక్షరాలతో ముద్రించేవారు.



అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలతో దేవికారాణి విలువైన ఆభరణాలు కొన్నారని ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె విలాసవంతమైన జీవితం గడుపు తున్నారని ఏసీబీ దర్యాప్తులో తేలింది. దేవికారాణి ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మితో కలిసి రెండు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారని గుర్తించారు.



నాగలక్ష్మి బంధువుల్లో ఎం.మురళీకృష్ణ పేరుతో మహీధర మెడికల్‌ అండ్‌ సర్జికల్‌ కంపెనీ ఒకటి ఏర్పాటు చేయగా.. అతని భార్య విజయలక్ష్మి పేరుతో జై సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్‌ మరో కంపెనీని ఏర్పాటు చేశారని ఏసీబీ గుర్తించింది. ఈ రెండింటినీ తేజా ఫార్మా కంపెనీ ఎండీ రాజేశ్వర్‌రెడ్డి 2016లో నమోదు చేయించినట్టుగా ఉందని ఏసీబీ దర్యాప్తులో బయటపడింది.