Omicron-RRR : ఏ వేరియంట్ వచ్చినా థియేటర్లు నడుస్తాయ్- మంత్రి తలసాని

సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తలసాని స్పష్టం చేసినట్టు నిర్మాతలు తెలిపారు.

Omicron-RRR : ఏ వేరియంట్ వచ్చినా థియేటర్లు నడుస్తాయ్- మంత్రి తలసాని

Talasani Ss Rajmouli

Omicron-RRR : ఒమిక్రాన్ వేరియంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతలకు దడ పుట్టిస్తోంది. చాలా నెలల తర్వాత బడా సినిమాల రిలీజ్ కు ప్లాన్ చేసుకున్న నిర్మాతలు.. ఇపుడు ఒమిక్రాన్ వేరియంట్ రాకతో డైలమాలో పడ్డారు. దేశంలో కరోనా పేషెంట్లలో ఒమిక్రాన్ గుర్తింపు, రాష్ట్రంలోనూ సందేహాస్పద కేసులు నమోదవుతుండటంతో… మళ్లీ లాక్ డౌన్ పెడతారా.. థియేటర్లు బంద్ చేస్తారా అన్న సందేహాలతో… అగ్ర నిర్మాతలు… హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశారు.

Also Read : RRR: గెట్ రెడీ.. ట్రైలర్ వచ్చేస్తుంది.. ఇక రచ్చ రచ్చే!

హైదరాబాద్ సెక్రటేరియట్ లో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను రాజమౌళి, దిల్ రాజు ఇతర నిర్మాతల బృందం కలిసింది. రిలీజ్ కు షెడ్యూల్ చేసుకున్న కొత్త సినిమాల గురించి చర్చించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏంటి… ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది.. అనేదానిపై చర్చించారు.
మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నిర్మాతలు. కరోనా ఏ వేరియంట్ వచ్చినా జనం టెన్షన్ పడొద్దని… థియేటర్లు మూసేసే నిర్ణయం తీసుకోబోమని తలసాని చెప్పారు. “ప్రజలు భయపడవద్దు. థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి. ఏ వేరియంట్ వచ్చినా తట్టుకునేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. థియేటర్ లు మూసివేయం. ఇబ్బందులు లేవు. నిర్మాతలు ఆందోళన పడాల్సిన పనిలేదు. టికెట్ రేట్ల అంశం పెండింగ్ లో ఉంది. నిర్మాతలకు నష్టం లేకుండా చూస్తాం” అని తలసాని చెప్పారు.

Also Read : Pushpa: తగ్గేదేలే.. ట్రైలర్ కు ముందు గ్లింప్స్ వచ్చేస్తున్నాయ్

తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలపై మంత్రి తలసానితో చర్చించామని నిర్మాత దిల్ రాజు చెప్పారు. “అనేక అంశాలు పరిష్కారం కావాల్సి ఉంది. పెద్ద సినిమాలు రిలీజ్ కోసం వేచి ఉన్నాయి. కోవిడ్ కారణంగా సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు పడింది. మరోసారి ఇంకో వేవ్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి మంత్రితో సమావేశం అయ్యాం. పెండింగ్ లో ఉన్న అంశాలు కూడా చర్చించాం” అని దిల్ రాజు చెప్పారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తలసాని స్పష్టం చేసినట్టు నిర్మాతలు తెలిపారు.