Ganesh’s immersion : గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయనున్న తెలంగాణ ప్రభుత్వం

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపోరాటానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఇవాళ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.

Ganesh’s immersion : గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయనున్న తెలంగాణ ప్రభుత్వం

Ts Govt (1)

Telangana government review petition : హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనాలపై నెలకొన్న ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది. హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపోరాటానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఇవాళ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది. నిమజ్జనాల కోసం ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అసాధ్యమని తెలపనుంది. సమయం తక్కువగా ఉండటంతో కుంటల నిర్మించడం వంటి పనులు చేపట్టడం కష్టమవుతుందని అందుకే ఈసారికి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతించాలని ప్రభుత్వం కోరనుంది. హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేసిన 48 గంటల్లో వ్యర్థాలు తీసివేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. వినాయక చవితికి ఒక రోజు ముందు తీర్పునిచ్చింది. హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. వాటిని వివిధ ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన 25 కుంటల్లో నిమజ్జనం చేయాలని ఆదేశించింది.

Hussain Sagar : గణేష్ నిమజ్జనం ఎక్కడ ? అంతా గందరగోళం

కృత్రిమ రంగులు లేని ఇతర విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయొచ్చని పేర్కొంది. అది కూడా ట్యాంక్‌ బండ్‌ వైపు నుంచి విగ్రహాల నిమజ్జనం చేయొద్దని.. పీవీ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌, సంజీవయ్య పార్క్‌ వైపు నుంచి నిమజ్జనాలు చేసుకోవాలని సూచించింది. సాగర్‌లో ప్రత్యేక రబ్బర్‌ డ్యామ్‌ ఏర్పాటు చేసి, అందులో నిమజ్జనం చేయాలని సూచించింది.

నగరంలో వినాయక విగ్రహాలు కలిపి దాదాపు 5 లక్షల వరకు ఉంటాయని అంచనా. వీటిలో లక్షకుపైగానే హుస్సేన్‌ సాగర్‌లోనే నిమజ్జనాలు చేస్తారు. 5 నుంచి 40 అడుగుల విగ్రహాల్లో ఎక్కువగా హుస్సేన్ సాగర్‌కే క్యూ కడుతుంటాయి. అయితే ఇప్పటికిప్పుడు కుంటల ఏర్పాటు ఇబ్బందితో కూడుకున్న వ్యవహారమంటోంది తెలంగాణ ప్రభుత్వం. హైకోర్టు క్షేత్రస్థాయి పరిస్థితిని అర్థం చేసుకోవాలంటోంది. భవిష్యత్‌లో ముందస్తు ఆదేశాలిస్తే ఏర్పాట్లు చేసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.