ఊహించని ఉగ్రదాడి : న్యూజిలాండ్ నరమేధాన్ని.. కిరాతకుడు లైవ్ ఇచ్చాడు

  • Published By: venkaiahnaidu ,Published On : March 15, 2019 / 09:26 AM IST
ఊహించని ఉగ్రదాడి : న్యూజిలాండ్ నరమేధాన్ని.. కిరాతకుడు లైవ్ ఇచ్చాడు

న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో శుక్రవారం(మార్చి-15,2019) దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 50కి చేరింది. మృతుల సంఖ్య 100కి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.శుక్రవారం కావడంతో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్దనలకు వచ్చారు. ఘటన సమయంలో ఒక మసీదులో 300మంది వరకు ఉన్నారని చెబుతున్నారు. మసీదులో మృతదేహాలు పడి ఉన్నాయి. ఒంటినిండా ఆయుధాలతో ఉన్న ఓ వ్యక్తి మసీదులోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ మసీదు దగ్గర కాల్పులకు తెగబడిన దుండగుడు తమ దేశానికి చెందిన వ్యక్తి అని, అతడు అతివాద భావజాలానికి ప్రేరేపితుడైన తీవ్రమైన ఉగ్రవాది అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించారు.చనిపోయినవారిలో మహిళలు,చిన్నారులు కూడా ఉన్నారు.

దాడి ఘటనను ప్రత్యక్ష ప్రసారం చేసి దుండగుడు తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. మొత్తం 17 నిమిషాలు దాడినంతా లైవ్ స్టీమింగ్ చేశాడు. లైవ్ స్టీమింగ్ లో మొదట తనను తాను పరిచయం చేసుకున్న దుండగుడు.. తనతో తెచ్చుకున్న ఆయుధాలను చూపించాడు. ఆ తర్వాత కారును అల్ నురా మసీదు దగ్గర్లో నిలిపి…లోపలికి నడుచుకుంటూ వెళ్లాడు. భవనం తలుపు దగ్గరకు వెళ్లగానే ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. విచక్షణారహితంగా అక్కడున్నవారిపై కాల్పులు జరిపాడు. అక్కడున్నవారందరూ భయంతో పరుగులు దీశారు, దాడికి ముందు దుండగుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తాను కాల్పులు జరుపబోతున్నట్లు పలు పోస్ట్ లు చేశాడు.

తాను ఎందుకు దాడి చేయబోతున్నాడో అనే దానికి సంబంధించిన కారణాలను కూడా అందులో తెలియజేసినట్లు తెలుస్తోంది. కేవలం దాడి చేసేందుకే ట్రైయినింగ్ తీసుకుని ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్లు దుండగుడు అందులో తెలిపినట్లు పోలీసులు తెలిపారు. దుండగుడి అకౌంట్స్ ను సోషల్ మీడియా సంస్థలు సస్పెండ్ చేశాయి. లైవ్ స్టీమ్ వీడియోను కూడా ఫేస్ బుక్ తొలగించింది. దాడి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.