మద్యం మత్తులో కన్నబిడ్డల గొంతుకోసిన తండ్రి

  • Published By: bheemraj ,Published On : November 8, 2020 / 03:08 AM IST
మద్యం మత్తులో కన్నబిడ్డల గొంతుకోసిన తండ్రి

father sobbing children : పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో ఇద్దరు చిన్నారుల గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన శనివారం ఉదయం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని చిట్టాపూర్‌లో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఖన్ధారి గ్రామానికి చెందిన నిజాం దేరేడి మహ్మద్‌ 15 ఏండ్ల క్రితం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతె గ్రామానికి వలస వచ్చాడు.



మాంసం విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మహ్మద్‌కు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలున్నారు. మొదటి భార్య
జమిరీద్‌(అంధురాలు)కు ఇద్దరు కూతుర్లు అంజూమన్‌, అలీనా.. కొడుకు ఫయాజ్‌ ఉన్నారు. రెండో భార్య మేరజ్‌కు కొడుకు ఉన్నాడు. కొద్దిరోజుల కిందట మేరజ్‌ తన కొడుకుతో కలిసి స్వగ్రామానికి (మహారాష్ట్రకు) వెళ్లింది. మూడు రోజుల క్రితం మహ్మద్‌ పెద్దభార్య జమిరీద్‌, పిల్లలతో కలిసి దుబ్బాక మండలం చిట్టాపూర్‌కు మకాం మార్చాడు.



చిట్టాపూర్‌కు వెళ్లినప్పటి నుంచి విపరీతంగా మద్యం తాగుతూ భార్య జమిరీద్‌తో గొడవ పడుతున్నాడు. శనివారం ఉదయం కొడుకు ఫయాజ్‌తో కలిసి జమిరీద్‌ కిరాణా దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో మహ్మద్‌ ఇంట్లో ఉన్న ఇద్దరు కూతుర్లను కత్తితో చంపేందుకు ప్రయత్నించాడు. ఇంట్లో నుంచి పిల్లల అరుపులు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.



భూంపల్లి ఎస్సై సర్దార్‌ జమిల్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహ్మద్‌ ఇంటి తలుపులు తెరవకపోవడంతో కానిస్టేబుళ్లు బాలరాజ్‌, రాజిరెడ్డి పైకప్పు రేకులు తొలగించి లోపలకు వెళ్లారు. మహ్మద్‌ కత్తితో అమ్మాయిల గొంతు కోస్తుండగా వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.

పిల్లలు అంజూమన్‌(8), అలీనా(6)కు గొంతుపై తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సిద్దిపేట సర్కారు దవాఖానకు తరలించి వైద్యం అందిస్తున్నారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.