వాట్ ఏ చేజింగ్: దొంగ రైలులో.. పోలీసులు విమానంలో

వాట్ ఏ చేజింగ్: దొంగ రైలులో.. పోలీసులు విమానంలో

సినిమాటిక్ గా జరిగిన ఈ చేజింగ్ గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 22ఏళ్ల వ్యక్తి సొంతూరు అయిన అజ్మర్‌లో యజమాని ఇంట్లోనే బంగారం దొంగిలించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. బెంగళూరు నుంచి బయల్దేరిన వ్యక్తి ఎవరికి తెలియదనుకుని రిలాక్స్‌డ్‌గా జర్నీ చేసి అజ్మర్ చేరుకున్నాడు. అక్కడ బెంగళూరు పోలీసులు ఆ వ్యక్తికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పి మర్యాదలతో తీసుకెళ్లారు. 

వివరాలిలా ఉన్నాయి. దీపావళి పండుగ రోజున ఓ స్నేహితుడి రికమెండేషన్ తో కుశాల్ సింగ్ అనే వ్యక్తి మెహక్ వీ పిరాగల్ ఇంట్లోకి పనికి కుదిరాడు. అదే రోజు సాయంత్రమే గార్మెంట్ షాపు పూజ కోసం వెళ్తున్నట్లు చెప్పి ఇంటిని చూసుకొమ్మని కుశాల్‌కు అప్పగించి వెళ్లిపోయాడు యజమాని. ఇంటికి తిరిగొచ్చి చూసేసరికి అంతా చిందరవందరగా పడేయడంతో పాటు వార్డ్ రోబ్ లో పెట్టి ఉంచిన బంగారు నగలు కనిపించలేదు. సింగ్ కోసం వెతికితే అతని జాడ తెలియలేదు. 

వెంటనే పిరాగల్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేసేసరికి కుశాల్ రైల్లో గుజరాత్ లోని అజ్మిర్ కు వెళ్తున్నట్లు తెలిసింది. అతన్ని ట్రాక్ చేస్తూనే అజ్మిర్ కు విమానంలో బయల్దేరారు పోలీసులు. మూడు రోజులు రైలు ప్రయాణం చేసి సొంతూర్లో దిగిన కుశాల్ సింగ్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. అతణ్ని అజ్మర్ రైల్వే స్టేషన్లోనే అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకొచ్చారు. 

ఆ బంగారపు నగలు అమ్మేంత గ్యాప్ కూడా ఇవ్వకపోవడంతో పూర్తి నగలను స్వాధీనపరచుకోగలిగారు. ఇప్పటివరకూ అతనిపేరిట ఎటువంటి నేర చరిత్ర లేదని త్వరగా లైఫ్ లో సెటిల్ అవ్వాలనే దురాశతోనే ఈ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.