స్వధాత్రి ఇన్ ఫ్రా స్కాంలో షాకింగ్ విషయాలు. ముగ్గురు అరెస్ట్!

  • Published By: sreehari ,Published On : July 4, 2020 / 04:41 PM IST
స్వధాత్రి ఇన్ ఫ్రా స్కాంలో షాకింగ్ విషయాలు. ముగ్గురు అరెస్ట్!

స్వధాత్రి రియల్ ఎస్టేట్ కంపెనీ స్కాంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 వేల మందికిపైగా బాధితులు ఉన్నారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి.. ఆ డబ్బుతో భూములను స్వధాత్రి కొనుగోలు చేసిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. మళ్లీ ఆ భూములును విక్రయించి బాధితులను యార్లగడ్డ రఘు అనే వ్యక్తి మోసానికి పాల్పడినట్టు తెలిపారు. అధిక వడ్డీ ఆశ చూపి ఏజెంట్లను స్వధాత్రి యజమాని నియమించుకున్నట్టు చెప్పారు. ప్రజల నుంచి కోట్ల రూపాయలను స్వధాత్రి ఏజెంట్లు వసూలు చేసినట్టు తెలిపారు.

మల్టీ లెవల్ మార్కెటింగ్ తీరుగానే రియల్ ఎస్టేట్ దందా కొనసాగిందని చెప్పారు. ఒక్క ఏజెంట్ ముగ్గురిని చేర్చితే అధిక మొత్తంలో యార్లగడ్డ రఘు కమీషన్లు ఇచ్చారని అన్నారు. స్వధాత్రి ఇన్ ఫ్రా పేరుతో ఘరానా మోసం జరిగిందని సీపీ సజ్జనార్ తెలిపారు. రఘు, శ్రీనివాస్, మీనాక్షిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. నిందితులు మూడు వేల మందిని మోసం చేసినట్టు గుర్తించామన్నారు. ఇప్పటివరకూ రూ.156 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఏజెంట్ల ద్వారా నిందితులు డబ్బులు వసూలు చేశారని చెప్పారు.

Swadhathri Infra Scam కు సంబంధించి సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అక్టోబర్ 2019లో ప్రారంభించిన ఆఫీసును రన్ చేస్తున్నారని, 20 SUV వాహనాలను ఆఫీసు ముందు పెట్టుకుని కస్టమర్లను నమ్మించారని అన్నారు. రియల్ ఎస్టేట్‌ లో ప్లాట్లు బుక్ చేసుకునేవారు ఎవరో ముందుగానే తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని సూచించారు. మార్కెట్ ఏజెన్సీకి సంబంధించి వివరాలను ధ్రువీకరించుకోవాలని అన్నారు.

ఇన్ ఫ్రా నిర్మించేవాళ్లు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి స్కీమ్‌లను ప్రజలు ఎవరూ నమ్మొద్దని అన్నారు. ముందుగా వెరిఫై చేసుకోవాలని అన్నారు. ఎన్ని ప్లాట్లకు అమౌంట్ ఇచ్చారో అనే విషయంలో విచారణ చేయాల్సి ఉందని అన్నారు. మాదాపూర్ లో అక్టోబర్ నుంచి ఈ స్కామ్ నడిచిందని చెప్పారు. ఇది కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమేనని అన్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు విచారణ జరగాల్సి ఉందని చెప్పారు.

Read:ఎమ్మెల్సీ స్థానం కోసం TRSలో పోటీ