ఘరానా దొంగ.. ఆలయాలే ఇతడి టార్గెట్.. 3 రాష్ట్రాలకు మోస్ట్‌ వాంటెడ్‌!

  • Published By: sreehari ,Published On : October 18, 2020 / 03:53 PM IST
ఘరానా దొంగ.. ఆలయాలే ఇతడి టార్గెట్.. 3 రాష్ట్రాలకు మోస్ట్‌ వాంటెడ్‌!

burglary of 22 Temples : ఇతడో ఘరానా దొంగ.. మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ కూడా.. భార్య, ప్రియురాలితో కలిసి పక్కా స్కెచ్ వేస్తాడు.. ఆలయాలే వీరి టార్గెట్.. ఇప్పటివరకూ 22 ఆలయాల్లో చోరీ చేశారు. చిక్కరు దొరకరు అన్నట్టుగా ఎప్పటినుంచో తప్పించుకు తిరుగుతూ పోలీసులకు చుక్కలు చూపించారు. ఎట్టకేలకు ఈ ముగ్గురు ఆళ్లగడ్డ పోలీసులకు చిక్కారు.



తాళం వేసి ఉన్న ఆలయాలపై రెక్కీ నిర్వహించడం.. భార్యతో కలిసి వెళ్లి ప్లాన్ వేయడం.. భార్యను కాపాలాగా ఉంచి.. ఇనుపరాడ్లతో తాళాలు పగలకొట్టి చోరీలకు పాల్పడుతుంటాడు.

ఇప్పటికే ఎన్నో ఆలయాల్లో చోరీకి పాల్పడిన నిందితుడు ఎరుకల నల్లబోతుల నాగప్ప పోలీసులకు చిక్కాడు. నాగప్పతో పాటు అతని భార్య లావణ్య, ప్రియురాలు ప్రమీలను గాజులపల్లి బుచ్చమ్మతోపు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.



అనంతరం ముగ్గురిని కోర్టులో హాజరు పరిచారు. కొన్ని రోజుల క్రితం.. శిరివెళ్ల పోలీసు స్టేషన్‌ సమీపంలో వెంకటాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి, ఎర్రగుంట్లలో శ్రీకృష్ణ మందిరం, ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసు స్టేష్ పరిధిలోని బత్తులూరు చెన్నకేశవస్వామి ఆలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు.



తలుపులు పగులగొట్టి హుండీల్లోని డబ్బు, విగ్రహాలపై వెండి నగలు అపహరించారు. ఘటనా స్థలాలను పరిశీలించిన పోలీసులు మూడు చోరీలు ఒకేలా జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. దొంగలను గుర్తించే పనిలో వేలిముద్రలను సేకరించారు. పాత నేరస్తుల వేలిముద్రలతో సరిపోల్చగా ఎరుకల నల్లబోతుల నాగప్పవిగా నిర్ధారించారు.



శిరివెళ్ల నుంచి తాడిపత్రి వరకు ఉన్న చెక్‌పోస్టు సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. నాగప్ప తన భార్యతో బైక్ పై తాడిపత్రికి వెళ్లినట్లు గుర్తించారు. ఆలయం వద్దనున్న సీసీ కెమెరాల ఫుటేజీలతో వాటిని సరిపోల్చారు.



అనంతపురం జిల్లాలో ఖాజీపేట గ్రామానికి చెందిన ఎరుకల నల్లబోతుల నాగప్ప అలియాస్‌ నాగరాజు 20 ఏళ్ల క్రితం గాజులపల్లె గ్రామానికి చెందిన లావణ్యతో పెళ్లి అయింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నాగప్ప దంపతులు పోలీసు రికార్డులకెక్కారు. ఇతర రాష్ట్రాల్లో వీరిపై సుమారు 22 కేసులు ఉన్నాయని విచారణలో తేలింది.