ఎప్పుడో ఉరి తీయాల్సింది : నిర్భయ దోషులకు త్వరలో మరణశిక్ష అమలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 31, 2019 / 04:19 PM IST
ఎప్పుడో ఉరి తీయాల్సింది : నిర్భయ దోషులకు త్వరలో మరణశిక్ష అమలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు విధించిన ఉరిశిక్షను త్వరలోనే అమలుచేస్తామని తీహార్ జైలు అధికారులు తెలిపారు. నలుగురు దోషులకు కూడా అక్టోబర్-28,2019న ఈ విషయాన్ని తెలియజేసినట్లు తీహార్ జైలు సూపరిడెంట్ తెలిపారు. గడువులోగా నేరస్థులు క్షమాభిక్ష,సవాల్ చేయడమో చేయకపోతే అదే విషయాన్ని న్యాయస్థానానికి తెలియజేస్తామని తెలిపారు. అనంతరం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మరణశిక్షను అమలుచేస్తామని తెలిపారు. ఈ కేసులోని నలుగురు దోషుల్లో ముగ్గురు తీహార్ జైలులో ఉండగా,ఇంకొకరు మండోలీ జైలులో ఉన్నారు.

మరణశిక్షను సవాల్ చేసే హక్కు దోషులకు ఉన్నప్పటికీ నలుగురిలో ఎవరూ దరఖాస్తు చేయలేదు. తమ శిక్ష తీవ్రతను తగ్గించి,మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని రాష్ట్రపతిని క్షమాభిక్ష పెట్టమని వేడుకునే అవకాశాన్ని కూడా వారు వినియోగించుకోకపోవడం గమనించదగ్గ విషయం.

నిర్భయ తల్లి ఆషాదేవి మాట్లాడుతూ..దోషులకు మరణశిక్ష అమలు ఎప్పుడో జరగాల్సి ఉందన్నారు. 2017లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఆమె గుర్తుచేశారు. 7ఏళ్లుగా తాను స్ట్రగుల్ అవుతూనే ఉన్నానని,ఇంకా దోషులకు ఉరిశిక్ష పడలేదన్నారు. జైలు అధికారులు మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు.