తమిళనాడులో లాకప్ డెత్ : పోలీసు దెబ్బలకు తండ్రి, కొడుకు మృతి  

తమిళనాడులో లాకప్ డెత్ : పోలీసు దెబ్బలకు తండ్రి, కొడుకు మృతి  

తమిళనాడులో లాకప్ డెత్ జరిగింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 9 గంటల తర్వాత షాపు తెరిచారనే కారణంతో ఒక కలప వ్యాపారిని తూతుక్కుడి  పోలీసులు అరెస్ట్ చేశారు.  తండ్రి అరెస్టు విషయం విచారించేందుకు స్టేషన్ కు వెళ్లిన అతడి కుమారుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో పోలీసులు కొట్టిన దెబ్బలకు తండ్రి కొడుకులిద్దరూ మృతి చెందటంతో జిల్లాలో ఉద్రిక్తత ఏర్పడింది.వ్యాపారస్తులు బంద్ పాటించి పోలీసులను శిక్షించాలని  కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

సాతంకుళం లో జూన్ 19వ తేదీ శుక్రవారం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కూడా కలప షాపు తెరిచి ఉంచాడనే కారణంతో  పి.జయరాజ్(63) అనే టింబర్ మర్చంట్ ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకువెళ్లారు. తన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారని తెలిసి కారణం తెలుసుకుందామని, విడిచిపెట్టమని కోరటానికి స్టేషన్ కు వెళ్ళిన…సెల్ ఫోన్ల వ్యాపారం చేసే అతని కుమారుడు ఫెనిక్స్(31) ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వారిద్దరిపై  ఐపీసీ సెక్షన్ 188, 269, 294(b), 353 and 506(2)ల కింద కేసు నమోదు చేశారు.

మర్నాడు ఇద్దరినీ  కోవిల్పట్టి సబ్ జైలుకు  తరలించారు. కాగా  కోవిల్పట్టి సబ్  జైలులో తన తండ్రిని  పోలీసులు కొట్టినందుకు ఫెనిక్స్ పోలీసులతో వాగ్యుద్దానికి దిగాడని పోలీసులు అతడ్ని కూడా తీవ్రంగా కొట్టారని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు.  కాగా సోమవారం జూన్ 22వ తేదీ సాయంత్రం ఫెనిక్స్ కు తీవ్రంగా రక్తస్రావం కావటంతో  పోలీసులు అతడిని కోవిల్పట్టి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ  మరణించాడు. మంగళవారం తెల్లవారు ఝూమున అతడి తండ్రి జయరాజ్ శ్వాసకోస సమస్యతో బాధ పడుతూ… శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటంతో అతడిని కూడా ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సకు స్పందించక జయరాజ్ మరణించాడు.

పోలీసులు జైలులో  తీవ్రంగా కొట్టటం వల్లే కొద్ది గంటల వ్యవధిలో తండ్రీ కొడుకులిద్దరూ మరణించారని ఇందుకు కారణమైన 13 మంది పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, తూతుక్కుడి,  ఉడుంగుడి,పాకాళం,సాతంకుళంలోని వ్యాపారస్తులు తమ షాపులు మూసి వేసి బంద్ పాటించారు. మృతదేహాలను పోలీసులు తిరునల్వేలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీసు చర్యలను ఖండిస్తూ జిల్లా లో పలుచోట్ల వర్తక సంఘాలు తమ షాపులను మంగళవారం మూసివేశాయి.  బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా షాపులు బంద్ చేయాలని తమిళనాడు ట్రేడర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. నిరసనకారులకు మద్దతు తెలుపుతూ… లాకప్ డెత్ కు కారణమైన  పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కనిమెళి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.

tamilnadu lockup death

Read: కోవిడ్ ఫ్రీ టెస్ట్ ల ఈ మెయిల్ వచ్చిందా జాగ్రత్త…! తెరిచారా…గోవిందా…….