దిశ రవికి బెయిల్.. టూల్‌కిట్‌ హింసను ప్రోత్సహించినట్టు కనిపించలేదు : ఢిల్లీ కోర్టు

దిశ రవికి బెయిల్.. టూల్‌కిట్‌ హింసను ప్రోత్సహించినట్టు కనిపించలేదు : ఢిల్లీ కోర్టు

Toolkit did not call for violence : ఢిల్లీ కోర్టులో పర్యావరణ కార్యకర్త దిశ రవికి రిలీఫ్ లభించింది. టూల్ కిట్ కేసులో ఆమెకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా దిశ రవికి బెయిల్‌ మంజూరు చేశారు. కొత్త సాగు చట్టాలపై ఆందోళనలు చేస్తోన్న రైతులకు మద్దతుగా సోషల్ మీడియా ద్వారా టూల్‌కిట్‌ను షేర్ చేశారంటూ దిశ రవిపై అభియోగాలు వచ్చాయి. టూల్‌కిట్‌ గురించి పోలీసులు చేస్తున్న అభియోగాల్లో దిశ రవి హింసను ప్రోత్సహించినట్టు ఎక్కడా కనిపించలేదని జడ్జి అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ తీరుపై పౌరుల నిరంతర పరిశీలన ఉంటుంది. అంతమాత్రానా వారిని జైల్లో ఉంచడం తగదని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ అహంకారం దెబ్బతింటే ఇలా దేశద్రోహ అభియోగం మోపడం సమంజసం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ ‘పోయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ (PJF‌)తో దిశ రవికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు నిరూపించే ఆధారాలను పోలీసులు సమర్పించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. వేర్పాటువాదులతో ఆమెకు సంబంధం ఉందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని తెలిపింది.

గతంలో ఎలాంటి నేర చరిత్రలేని యువతికి బెయిల్‌ నిరాకరించడానికి ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదని కోర్టు తెలిపింది. విభేదించే హక్కును రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ బలంగా చెబుతోందని, కమ్యూనికేషన్‌కు భౌగోళిక హద్దులేమీ లేవని జడ్జి ధర్మేంద్ర పేర్కొన్నారు. సమాచారాన్ని పొందడానికి అందుబాటులో ఉన్న టూల్ కిట్ వంటి వాటిని వినియోగించుకునే హక్కు పౌరులకు ఉందని స్పష్టం చేశారు.

విచారణకు దిశ సహకరించాలని, అధికారులు పిలిచినప్పుడు దర్యాప్తుకు హాజరు కావాలని కోర్టు సూచించింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. బెయిల్ మంజూరు కావడంతో దిశ రవి తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. కుమార్తెకు బెయిల్‌ దొరకడంపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తమకు మరింత విశ్వాసం పెరిగిందని అన్నారు. కోర్టు తీర్పును దిశా రవి కుటుంబం, మాజీ మంత్రి పి చిదంబరం లాంటి ప్రతిపక్ష నేతలు కూడా స్వాగతించారు.