ప్రాణం తీసిన టీవీ సీరియల్… మంటల్లో చిక్కుకుని మహిళ మృతి

సీరియల్ చూడటంలో మునిగిపోయిన ఓ మహిళ.. మంటల్లో చిక్కుకుని మరణించింది.

  • Published By: veegamteam ,Published On : February 22, 2020 / 05:40 AM IST
ప్రాణం తీసిన టీవీ సీరియల్… మంటల్లో చిక్కుకుని మహిళ మృతి

సీరియల్ చూడటంలో మునిగిపోయిన ఓ మహిళ.. మంటల్లో చిక్కుకుని మరణించింది.

టీవీ సీరియల్స్ కు కొందరు మహిళలు ఏ రేంజ్ లో అడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తినడం, తాగడం అయినా మర్చిపోతారేమో కానీ.. టైమ్ కి సీరియల్ చూడటం మాత్రం మర్చిపోరు. సీరియల్ చూడటంలో పడితే.. పక్కన ఏం జరుగుతోంది అనేది కూడా కొందరు పట్టించుకోవడం లేదు. ఇలా.. సీరియల్స్ పిల్చిలో పడి.. కొందరు మహిళలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సీరియల్ చూడటంలో మునిగిపోయిన ఓ మహిళ.. మంటల్లో చిక్కుకుని మరణించింది. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.

దీపం వెలిగించి సీరియల్ చూస్తోంది:
మదురై కామరాజపురం భగత్‌సింగ్‌ వీధికి చెందిన రమేష్‌, మహాలక్ష్మి(41) దంపతులు. మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. రమేశ్ ఇద్దరు పిల్లలను తీసుకుని భగత్‌సింగ్ వీధిలో నివాసముంటుండగా, మహాలక్ష్మి బంధువుల ఇంట్లోనే ఓ పోర్షన్ అద్దెకు తీసుకుని ఉంటోంది. ఒంటరితనం వల్ల ఆమె టీవీ సీరియల్స్‌కు బానిసైంది. రోజూంతా సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తుంది. ఈ క్రమంలోనే మంగళవారం(ఫిబ్రవరి 18,2020) సాయంత్రం దేవుడి ముందు దీపం వెలిగించిన మహాలక్ష్మి తర్వాత టీవీ సీరియల్ చూస్తోంది.

ఒరిగిన దీపం.. వ్యాపించిన మంటలు:
అదే సమయంలో దీపం కింద పడి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు గది అంతా వ్యాపించాయి. సీరియల్‌ లో మునిగిపోయిన మహాలక్ష్మి దీన్ని గమనించలేదు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వాళ్లు ఆమెకు విషయాన్ని చెప్పారు. కంగుతిన్న మహాలక్ష్మి.. మంటలు ఆర్పేందుకు గదిలోకి వెళ్లింది. అప్పటికే రూమ్ అంతా మంటలు వ్యాపించి ఉన్నాయి. దీంతో మంటల్లో చిక్కుకుని ఆమె సజీవ దహనమైంది. ఆమెని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. టీవీ సీరియల్ పిచ్చి మహాలక్ష్మి ప్రాణం తీయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలిసి స్థానికులు షాక్ తిన్నారు.

చిన్న నిర్లక్ష్యం.. భారీ మూల్యం:
టీవీ చూడటం, సీరియల్స్ చూడటం తప్పు కాదు నేరమూ కాదు. కానీ.. ఒళ్లు మరిచి పక్కనేం జరుగుతుందో పట్టించుకోకుండా మునిగిపోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు. చిన్న నిర్లక్ష్యానికి కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. సీరియల్స్ లో ముగినిపోయి లోకాన్ని మర్చిపోయే వారికి ఇదో కనువిప్పు కలిగించే ఘటన అని నెటిజన్లు అంటున్నారు. 

Read More>>ట్రెండ్లీ ఫుడ్ : ‘ఐస్ క్రీమ్ దోశ’ టేస్ట్‌కు ఫిదా అయిపోతున్న జనాలు