Vijayawada : విజయవాడలో రౌడీ షీటర్ ఆత్మహత్య-ఫుట్‌బాల్ ప్లేయర్ హత్య

విజయవాడలో రెండు సంఘటనలు జరిగాయి. ప్రియురాలు మందలించిందని రౌడీ షీటర్ ఆత్మహత్య చేసుకోగా.... అతనికి చెందిన రెండు గ్రూపుల్లో జరిగిన గొడవలో ఒక పుట్ బాల్ ప్లేయర్ హత్యకు గురయ్యాడు.

Vijayawada : విజయవాడలో రౌడీ షీటర్ ఆత్మహత్య-ఫుట్‌బాల్ ప్లేయర్ హత్య

Vijayawada Crime

Vijayawada :  విజయవాడలో రెండు సంఘటనలు జరిగాయి. ప్రియురాలు మందలించిందని రౌడీ షీటర్ ఆత్మహత్య చేసుకోగా…. అతనికి చెందిన రెండు గ్రూపుల్లో జరిగిన గొడవలో ఒక పుట్ బాల్ ప్లేయర్ హత్యకు గురయ్యాడు.

వివరాల్లోకి వెళితే …. విజయవాడ వాంబే కాలనీలో శంకర్ అలియాస్ టోనీ అనే రౌడీ షీటర్ తన ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు.  శంకర్  బాగా మద్యం తాగేవాడు. ఈ క్రమంలో అతని ప్రియురాలు ఎక్కువగా మద్యం సేవించవద్దని అతడ్ని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన టోనీ సోమవారం ఉదయం సీలింగ్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఆసమయంలో టోనీ అనుచరులు పెద్ద ఎత్తున ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. అక్కడకు  వచ్చిన వారు మద్యం సేవించటానికి సమీపంలోని బార్ కు వెళ్లారు.  వీరిలో రెండు వర్గాలు ఉన్నాయి. ఓ వర్గానికి చెందిన జక్కంపూడి కాలనీకి చెందిన  ఆకాశ్(28) అనే యువకుడికి  మరో వర్గంలోని వారితో బార్ లో గొడవ జరిగింది.

దీంతో అతను ప్రత్యర్ధుల్లో ఒకరిని కొట్టాడు. అనంతరం అక్కడున్న వారు ఆకాశ్ ను బలవంతంగా అక్కడ నుంచి … గురునానక్ కాలనీలో ఉన్న  మరో  స్నేహితుడి గదికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్ధి వర్గానికి చెందిన 10 మందికి పైగా యువకులు మద్యం, గంజాయి తాగి గురునానక్ కాలనీలో ఆకాశ్  ఉంటున్నరూమ్ వద్దకు  వచ్చారు. ఆ సమయంలో ఆకాశ్ మద్యం మత్తులో నిద్రపోతున్నాడు. అతనితో  పాటు మరో ముగ్గురు ఉండగా ప్రత్యర్ధి వర్గం వారిని  చూసి అందులో ఇద్దరు పారిపోయారు. అక్కడే ఉన్న మరోక వ్యక్తిని వారు బెదిరించి పంపించి  వేశారు.

అనంతరం ఆకాశ్ ను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశారు. అరగంట తర్వాత పారిపోయిన స్నేహితులు వచ్చి చూడగా ఆకాశ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే వారు అతడిని  ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  వైద్యులు   పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న  పటమట పోలీసులు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు.  అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి  తరలించారు. ఆకాశ్ శరీరంపై మొత్తం 16  కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. విషయం తెలిసిన ఆకాశ్ స్నేహితులు సుమారు 50 మంది ఆస్పత్రికి చేరుకున్నారు. ఆకాశ్   రాష్ట్ర స్ధాయి ఫుట్ బాల్   ప్లేయర్ అని అతని స్నేహితులు చెప్పారు. రెండు పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగిన ఈ ఘటనల్లో పోలీసుల విచారణలో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

Also Read : Crime news: పోలీసుల అత్యుత్సాహం.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి