ఘరానా మోసం : అద్దె పేరుతో కార్లు తీసుకుని జల్సాలు

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 03:36 AM IST
ఘరానా మోసం : అద్దె పేరుతో కార్లు తీసుకుని జల్సాలు

హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అద్దె పేరుతో కార్లు తీసుకుని వాటిని తనఖా పెట్టి సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీ నగర్‌ ఎస్‌వోటీ పోలీసులు ఇద్దరిని అరెస్టు  చేశారు. వారి నుంచి రూ. 2 కోట్ల 45లక్షల 70వేల విలువైన 23 కార్లు, 4 సెల్‌ ఫోన్లు, రూ. 4.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు కందుల శ్రీకాంత్‌చారి అలియాస్‌ అమ్ముల  శ్రీకాంత్‌(30). 7వ తరగతి వరకు చదువుకున్న శ్రీకాంత్.. 2017లో 10 నెలల పాటు సీఎం కార్యాలయంలో తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేశాడు. డ్యూటీకి సరిగా రాకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. విలాసాలకు  అలవాటుపడిన శ్రీకాంత్‌ ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్నట్లు అమాయకులను నమ్మించాడు. తనకు తెలిసిన అధికారుల దగ్గర కార్లను అద్దెకు పెట్టిస్తానని ఓనర్లను  చెప్పేవాడు. ఆ తర్వాత వాటిని అమీర్‌పేట్ కు చెందిన సర్దార్‌ మహేందర్‌సింగ్‌ అలియాస్‌ బంటు(37) అనే ఫైనాన్షియర్‌ దగ్గర తనఖా పెట్టేవాడు.
 
ఫైనాన్షియర్‌ బంటు.. శ్రీకాంత్ కి రూ. 4 లక్షలు ఇచ్చేవాడు. అలా వచ్చే డబ్బును కార్ల ఓనర్లకు నెలకు రూ.30 వేల చొప్పున శ్రీకాంత్ ఇచ్చేవాడు. అతడి మాయమాటల నమ్మిన కొంతమంది తమ కార్లను ఇచ్చేవారు.  మొదటి నెల అద్దె డబ్బులు మాత్రమే ఓనర్లకు ఇచ్చేవాడు. తర్వాత నెల.. కార్ల ఓనర్లకు డబ్బులివ్వకుండా.. ఫోన్‌ చేస్తే సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరిగేవాడు. దీంతో అనుమానం వచ్చిన కార్ల ఓనర్లు  పోలీసులను ఆశ్రయించారు. తీగ లాగితే డొంక కదిలింది. శ్రీకాంత్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

2019 జనవరిలో మారుతి స్విఫ్ట్‌ డిజైర్‌ కారును మహేందర్‌ సింగ్‌ దగ్గర తనఖా పెట్టి రూ. 2 లక్షలు తీసుకున్న శ్రీకాంత్.. కొన్నాళ్ల తర్వాత డబ్బు చెల్లించి కారు తీసుకెళ్లడంతో ఫైనాన్షియర్‌కు అతడిపై నమ్మకం కలిగింది.  ఇద్దరూ కలిసి కార్ల ఓనర్లను మోసం చేసి డబ్బు సంపాదించాలని పథకం వేశారు. శ్రీకాంత్‌ 30 కార్లను తీసుకొచ్చి మహేందర్‌ సింగ్‌కు అప్పగించాడు. వాటిని తనఖా పెట్టుకుని రూ. 36 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బుతో  శ్రీకాంత్‌ మొదటి నెల అద్దె కింద వాహనాల యజమానులకు కొంత ఇచ్చాడు. మిగతా డబ్బుతో శ్రీకాంత్‌ జల్సాలు చేసేవాడు. నెలనెలా డబ్బు చెల్లించకపోవడంతో మహేందర్‌సింగ్‌ కార్లను తెలిసిన వారికి అద్దెకు ఇస్తూ  డబ్బు సంపాదించేవాడు. సదరు కార్లలో ఏడింటిలో జీపీఎస్‌ ఉండడంతో యజమానులు వాటిని గుర్తించి వెనక్కి తీసుకెళ్లారు. ఇంకా 23 కార్లు మహేందర్‌సింగ్‌ అధీనంలోనే ఉన్నాయి. పోలీసులు వారిని అరెస్ట్ చేసి కార్లను స్వాధీనం చేసుకున్నారు.