యూనివర్సిటీకి వెళ్లక్కర్లేదు, కష్టపడి పరిశోధన చేయక్కర్లేదు.. డబ్బులిస్తే డాక్టరేట్, కరీంనగర్‌లో నయా దందా

  • Published By: naveen ,Published On : September 29, 2020 / 02:50 PM IST
యూనివర్సిటీకి వెళ్లక్కర్లేదు, కష్టపడి పరిశోధన చేయక్కర్లేదు.. డబ్బులిస్తే డాక్టరేట్, కరీంనగర్‌లో నయా దందా

Honorary Doctorates For Money: యూనివర్శిటీకి వెళ్లక్కర్లేదు…కష్టపడి పరిశోధన చేయక్కర్లేదు..డబ్బులు కుమ్మరిస్తే డాక్టరేట్లు..అవును నిజమే… ఏదైనా అంశంపై పరిశోధన చేస్తేనో…..ఏదైనా రంగంలోవిశేష సేవ చేస్తే ప్రభుత్వం ఇస్తేనో వచ్చే డాక్టరేట్లు…ఇప్పుడు అంగడి సరుకుగా మారిపోయాయి. కేవలం ఫోన్ చేసి..డబ్బులు చెల్లిస్తే…చాలు… పీహెచ్‌డీ సర్టిఫికేట్… ఇంటికే వస్తుందంటే… కొన్ని యూనివర్శిటీలు ఎంత దందా చేస్తున్నాయో అర్ధమవుతుంది… మార్కెట్ సరుకుగా మారిన…డాక్టరేట్ సర్టిఫికెట్ల పై 10 టీవీ స్పెషల్ స్టోరీ…

కరీంనగర్‌లో నయా దందా, డబ్బులిస్తే డాక్టరేట్:
కరీంనగర్‌లో నయా దందా.. డబ్బులిస్తే.. డాక్టరేట్‌…. మార్కెట్‌లో సరుకులా మారిన డాక్టరేట్‌ సర్టిఫికెట్స్‌.. డబ్బులు తీసుకొని డాక్టరేట్‌ ఇస్తోన్న యూనివర్సిటీలు.. మీరు డాక్టర్‌ గౌరవం పొందాలనుకుంటున్నారా… మీకు డాక్టరేట్‌ సర్టిఫికెట్‌ కావాలా.. అయితే మీ దగ్గర డబ్బు ఉందా.. డబ్బులు ఉంటే చాలు.. డాక్టరేట్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు… మీరు డాక్టర్‌ అయిపోవచ్చు. ఏంటీ నమ్మడం లేదా… అయితే ఈ ఆడియో వినండి.

అంగడిలో సరుకులా డాక్టరేట్ సర్టిఫికెట్లు:
డబ్బులిస్తే చాలు.. డాక్టరేట్‌ ఇవ్వడానికి యూనివర్సిటీ ప్రతినిధులు రెడీగా ఉన్నారు. అన్నట్టు ఆ యూనివర్సిటీ ఏదో తెలుసా. గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ. కాసుల కోసం.. డాక్టరేట్‌ సర్టిఫికెట్లను అంగడిలో సరుకులా మార్చింది. డబ్బుంటే చాలు.. డాక్టరేట్‌ సర్టిఫికెట్‌ వెంటనే ఇచ్చేస్తుంది. ఎలాంటి అర్హత అవసరం లేదు. కేవలం మనీ ఉంటే చాలు… 24 గంటలు గడవకుండానే డాక్టరేట్‌ సర్టిఫికెట్‌ మీ ఇంటి గుమ్మం ముందు ఉంటుంది. ఇదంతా గుట్టుగా జరుగుతున్న దందా. గడిచిన ఆరు నెలల కాలంలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన 20మందికి డబ్బులు తీసుకుని డాక్టరేట్‌ సర్టిఫికెట్లు ఇచ్చింది. ఎప్పుడు ఎవరికి ఎలాంటి సేవ చేయని వారిని.. డాక్టర్లుగా మార్చేసింది. దీంతో మరికొంతమంది డాక్టరేట్‌ సర్టిఫికెట్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

రూ.20వేలకే డాక్టరేట్ సర్టిఫికెట్:
వాస్తవానికి డాక్టరేట్‌ రావాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఏదైనా రంగంలో అసమాన ప్రతిభ కనబర్చినా, సామాజిక సేవా కార్యక్రమాలు చేసినా… వారి కృషిని గుర్తించి ఆయా యూనివర్సిటీలు డాక్టరేట్‌ ప్రకటిస్తాయి. ఏదైనా సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ చేసిన వారికి కూడా డాక్టరేట్‌ సర్టిఫికెట్స్‌ అందిస్తాయి. ఈ నిబంధనలు గ్లోబల్‌ పీస్‌లాంటి యూనివర్సిటీలు బేఖాతర్‌ చేస్తున్నాయి. డబ్బులకు డాక్టరేట్‌ సర్టిఫికెట్లను అమ్ముకుంటున్నాయి. ఒక్కో డాక్టరేట్‌ సర్టిఫికెట్‌ను 20వేల నుంచి 50వేలకు బేరం పెడుతున్నాయి.

కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్ వరప్రసాద్ అనే వ్యక్తి.. గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ డాక్టరేట్‌ సర్టిఫికెట్లు అందజేస్తోందని తెలుసుకుని ఆ యూనివర్సిటీ ఏజెంట్‌ను సంప్రదించారు. శ్రీనివాస్‌ కాంటాక్ట్‌ అయిన కొద్ది సేపటికే అతడికి ఆ యూనివర్సిటీ ప్రతినిధి నుంచి రిటన్‌ కాల్‌ వచ్చింది. చిన్న చిన్న సేవలు చేసే వరప్రసాద్‌కు.. డాక్టరేట్‌ ఇస్తామనని యూనివర్సిటీ ప్రతినిధి తెలిపారు.

కాకపోతే.. కొంత డబ్బు చెల్లించాలని మెలిక పెట్టారు. దీంతో రూ.20వేలకు బేరం కుదరిరింది. డబ్బులు చెల్లించడంతో.. గంటలోపే గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ డాక్టరేట్‌ సర్టిఫికెట్‌ను శ్రీనివాస్‌ వరప్రసాద్‌ మెయిల్‌కు పంపింది. పట్టా కోసం గోవాకు రావాలని చెప్పగా… తనకు వీలుకాదని వరప్రసాద్‌ చెప్పారు. దీంతో సర్టిఫికెట్‌ను కొరియర్‌ చేస్తామని యూనివర్సిటీ ప్రతినిధి చెప్పారు.

గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీనే కాదు… ఇలా డబ్బుల కోసం డాక్టరేట్లను ఇస్తున్న యూనివర్సిటీలు చాలానే ఉన్నాయి. ఇంటర్నేషనల్‌ పీస్‌ యూనివర్సిటీ, ఇండియన్‌ వర్చుల్‌ యూనివర్సిటీ, కింగ్స్‌ యూనివర్సిటీ, తమిళ యూనివర్సిటీలు ఇందులో ఉన్నట్టు ఆరోపణలున్నాయి. కాసుల కక్కుర్తితో సాహిత్యం, సోషల్‌ వర్క్‌, కళా, సినీలాంటి అన్ని రంగాల్లోనూ డాక్టరేట్స్‌ ఇచ్చేస్తున్నాయి. ఏజెంట్లను నియమించుకుని మరీ డబ్బులకు సర్టిఫికెట్లను అమ్మేస్తున్నాయి.

డబ్బులు తీసుకొని డాక్టరేట్‌ సర్టిఫికెట్లు ఇస్తున్న యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. అలాంటి యూనివర్సిటీల అనుమతి రద్దు చేయాలని కోరుతున్నారు.