అట్టుడుకుతున్న అస్సాం…ఇంటర్నెట్ బంద్

  • Published By: venkaiahnaidu ,Published On : December 11, 2019 / 01:42 PM IST
అట్టుడుకుతున్న అస్సాం…ఇంటర్నెట్ బంద్

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అసోంలో నిరసనలు మిన్నంటాయి. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. డిస్ పౌర్ లో పలు చోట్ల బస్సులకు,వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.

గౌహతిలో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.  దిబ్రుఘర్ లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో అక్కడ భారీగా సెక్యూరిటీని రంగంలోకి దించారు. . ఆందోళ‌న‌లు మిన్నంట‌డంతో.. అసోంలోని 10జిల్లాల్లో ఇవాళ రాత్రి 7గంటల నుంచి పు రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు  మొబైల్ ఇంట‌ర్నెట్ సేవలను ప్ర‌భుత్వం నిలిపివేసింది. గౌహ‌తిలో ఇవాళ రాత్రి 7 నుంచి రేప‌టి ఉద‌యం వ‌ర‌కు క‌ర్ఫ్యూ విధించారు.

ఈశాన్య రాష్ట్రాల‌కు మొత్తం 5 వేల మంది పారామిలిట‌రీ బ‌ల‌గాల‌ను తరలించింది కేంద్రం . కొన్ని చోట్ల జ‌రిగిన అల్ల‌ర్ల‌లో జ‌ర్న‌లిస్టులు కూడా గాయ‌ప‌డ్డారు. త్రిపుర ప్ర‌భుత్వం మొబైల్ ఇంట‌ర్నెట్‌, ఎస్ఎంఎస్ స‌ర్వీసుల‌ను 48 గంట‌ల పాటు నిలిపివేసింది. ఇప్పటికే లోక్ సభలో పాస్ అయిన ఈ బిల్లును ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టింది కేంద్రప్రభుత్వం