వామన్‌రావు దంపతుల హత్య కేసులో వీడిన మిస్టరీ : ఏ1గా కుంట శ్రీను.. ఏ2గా చిరంజీవి

వామన్‌రావు దంపతుల హత్య కేసులో వీడిన మిస్టరీ : ఏ1గా కుంట శ్రీను.. ఏ2గా చిరంజీవి

Vaman rao murder Case Mistery : వామన్ రావు హత్యకేసులో మిస్టరీ వీడుతోంది.. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులుగా కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్ లు అరెస్ట్ అయ్యారు. మంథని కోర్టు నుంచి హైదరాబాద్ వెళ్లే సమయంలో వామన్ రావును హత్య చేయాలని శ్రీనివాస్ పథకం వేశాడని పోలీసులు పేర్కొన్నారు. వామన్ రావు కదలికలను గమనించాలని చిరంజీవి, కుమార్ కు సూచించాడని తేలింది. బిట్టు శ్రీను అనే వ్యక్తి కత్తులు, కారును కుంట శ్రీనివాస్ కు ఇచ్చాడు. కారులో కుంట శ్రీను, చిరంజీవి వెళ్లారని పోలీసులు వెల్లడించారు.

రామగిరి గ్రామ శివారులో రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయని, కారు నెమ్మదిగా వెళ్తుందని గమనించి అక్కడ మాటు వేశారు. వామన్ రావు వస్తున్న కారును తన కారుతో శ్రీనివాస ఢీకొట్టాడు. భయంతో వామన్ రావు కారు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. వామన్ రావు కారును నడిపే ప్రయత్నం చేయగా.. అతన్ని బయటకు లాగి కుంట శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. వామన్ రావు భార్య నాగమణిపై చిరంజీవి దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు. దాడి అనంతరం కారులో నిందితుడు పరారయ్యాడని వెల్లడించారు. దాడికి ఉపయోగించిన కత్తులను సుందిళ్ల బ్యారేజ్ నీటిలో పడేశారని తెలిపారు. అక్కడి నుంచి నిందితులు మహారాష్ట్ర వెళ్లారని, కుంట శ్రీనివాస్, వామన్ రావు మధ్య ఐదేళ్లుగా కోల్డ్ వార్ జరుగుతోందని వెల్లడించారు.

వాంకిడి చంద్రపూర్ మధ్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంజపడుగులోని దేవాలయ కమిటీ వివాదం, ఇంటి నిర్మాణం, కుల దేవత ఆలయ నిర్మాణ పనులను వామన్ రావు అడ్డుకున్నాడు. దీంతో వామన్ రావుపై కుంట శ్రీనివాస్ కక్ష పెంచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. వామన్ రావు హత్యకు బిట్టు శ్రీను సహకారం తీసుకున్నారని దర్యాప్తులో గుర్తించారు. వామన్ రావు దంపతుల కదలికలపై రెక్కీ నిర్వహించిన నిందితులు.. ఎప్పటికప్పుడూ గమనించి కుమార్ అనే వ్యక్తి సమాచారం ఇచ్చాడు.

కుంట శ్రీనుకు రెండు కొబ్బరి బొండాం కత్తులు, తన కారును బిట్టు శీను ఇచ్చాడు. రామగిరి ప్రాంతంలో వామన్ రావు కోసం కుంట శ్రీను కాపు కాశాడు. కత్తితో కారు అద్దాన్ని పగలగొట్టగా ప్రాణభయంతో డ్రైవర్ పారిపోయాడు. కారులో పారిపోయేందుకు వామన్ రావు ప్రయత్నించగా.. కారులో నుంచి బయటకు లాగి కుంట శ్రీను కత్తితో నరికేశాడని పోలీసులు వెల్లడించారు. వామనరావు భార్య నాగమణిపై కూడా చిరంజీవి కత్తితో దాడి చేశాడు.