దీపిక ఎక్కడ? ఇంకా దొరకని ఆచూకీ, ఆందోళనలో కుటుంబసభ్యులు, కారులో తీసుకెళ్లింది ఎవరు?

  • Published By: naveen ,Published On : September 28, 2020 / 01:35 PM IST
దీపిక ఎక్కడ? ఇంకా దొరకని ఆచూకీ, ఆందోళనలో కుటుంబసభ్యులు, కారులో తీసుకెళ్లింది ఎవరు?

vikarabad deepika kidnap case.. వికారాబాద్‌ యువతి కిడ్నాప్ కేస్‌ సస్పెన్స్‌గా మారింది. 17 గంటలు గడుస్తున్నా.. ఇంకా యువతి ఆచూకీ తెలియలేదు. రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా లాక్కెళ్లిన ఘటన.. వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యువతి కుటుంబసభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు.

2016లో ప్రేమ పెళ్లి చేసుకున్న దీపిక:
వికారాబాద్‌కు చెందిన దీపిక 2016లోనే అఖిల్ అనే వ్యక్తిని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం ఇష్టం లేని అమ్మాయి తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం దీపికను ఇంటికి తీసుకెళ్లారు. దీంతో దీపిక, అఖిల్ కుటుంబసభ్యుల మధ్య పెద్ద గొడవే జరిగింది. అయితే విడాకుల కోసం ఇద్దరి మధ్య.. వివాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇరు కుటుంబసభ్యుల మధ్య కేసు కూడా నడుస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 26,2020 న రెండు కుటుంబాలు కోర్టుకు హాజరయ్యారు. అయితే 27వ తేదీ సాయంత్రం దీపిక తన అక్కతో కలిసి బయటికి రావడంతో.. ఆమె భర్త కారులోనే వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.



దీపిక కిడ్నాపైందా? భర్తనే తీసుకెళ్లాడా?
అసలు యువతి కిడ్నాపైందా? లేక భర్తనే తీసుకెళ్లాడా? అన్న అనుమానాలు తలెత్తాయి. ఒకవేళ భర్త రాకపోతే.. అతని కారులో వచ్చిన వ్యక్తులు ఎవరనే దానిపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై డీఎస్పీ సంజీవరావు తమ సిబ్బందితో ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇరు కుటుంబసభ్యులను విచారించనున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి విషయం ఇప్పుడే తెలిసింది:
తన కొడుకు పెళ్లి చేసుకున్న విషయం.. తనకు నిన్ననే తెలిసిందన్నాడు అఖిల్‌ తండ్రి ఖాజామియా. నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నా.. స్విచ్చాఫ్‌ వస్తోందని చెప్పాడు. విడాకుల కోసం ఇద్దరూ కోర్టుకి వెళ్లినట్లు తెలిసిందని ఆయన తెలిపాడు. మధు దీపిక కిడ్నాప్‌పై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిన్న(సెప్టెంబర్ 27,2020) సాయంత్రం యువతి కిడ్నాప్‌కు గురైందని తమకు ఫిర్యాదు అందిందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వికారాబాద్‌ సీఐ రాజశేఖర్‌ తెలిపారు.